కాన్పుకు ముహూర్తాలు చూడకండి.. మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం, కల్యాణలక్ష్మి, షాదీముభారక్ లబ్ధిదారులకు, వర్షాలకు హౌస్ డ్యామేజ్ బాధితులకు, ప్రకృతి వైపరీత్యాలతో మృతిచెందిన ఒకరి కుటుంబ సభ్యులకు క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు..పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కారాదనే ఒక లక్ష నూట పదహారు రూపాయలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో 12 వేల రూపాయలు, కెసిఆర్ కిట్ అందించి సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వేలకు వేలు ఖర్చు చేసి పెద్దాపరేషన్ చేయించి ప్రసవాలు పొంది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలన్నారు.
ప్రసవం అయిన మొదటి గంటలో తల్లిపాలను సేవించడం మూలంగా పిల్లలు మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఎదుగుతారన్నారు. సిజేరియన్ చేయించుకుంటే తల్లులు కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విజయవంతంగా కీలు మార్పిడి చికిత్స కూడా పైసా ఖర్చు లేకుండా నిర్వహించడం జరిగిందన్నారు. పేద ప్రజల తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఉపయోగించుకోవాలని… ప్రభుత్వ వైద్య సేవలను పేద ప్రజలు ఉపయోగించుకుంటే ప్రభుత్వ సంతోషిస్తుందన్నారు.