తాను రిటైర్డ్ ఉద్యోగి బిడ్డనేనని తెలిపారు మంత్రి హరీష్ రావు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ కన్వెన్షన్ లో విశ్రాంత ఉద్యోగుల కృతజ్ఞత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు….సీఎం మంచి వేతన సవరణ చేసినందుకు కృతజ్ఞత సభ పెట్టుకుంటామని రిటైర్డ్ ఉద్యోగులు కోరితే వచ్చానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కృషి ఎనలేనిదన్నారు.
14-15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం….తెలంగాణ వస్తే అంతా చీకటేనని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే.. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చేలా రాష్ట్రం ఎదిగిందన్నారు. ప్రస్తుతం మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగి.. పక్క రాష్ట్రాలకు ఇస్తున్నాం అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు బతికుండగా చూస్తామా అన్నారంతా. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సేకరిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారని..కానీ కానీ కాళేశ్వరం తొలి ఫలితం హుజురాబాద్ కే దక్కిందన్నారు.
దేశంలో అధిక ధాన్యం పండించే పంజాబ్ ను అధిగమించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంను మన రైతులు పండించారని తెలిపారు. ఇక్కడ పండించిన వడ్లు జోకాలంటే కూలీలు కూడా దొరకనంతగా పంట పండిందని…70 ఏళ్లలో సాధ్యంకాని పనులెన్నో పూర్తి చేసుకున్నాం అన్నారు.
ఆర్టీసీకి ఏడాదికి 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కాపాడుతుంటే.. కేంద్రం రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకశ్రయాలు అమ్ముతోందన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. మన కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి సీఎం ఆస్తులు పెంచుతున్నారని తెలిపారు. ఆస్తులను పెంచేవాళ్లను నమ్మాలా ? అమ్మేవాళ్లను నమ్మాలా? ఆలోచించుకోవాలన్నారు. ఎంత ఆదాయం తగ్గినా… అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
టీఆర్ఎస్ 30 శాతం ఫిట్ మెంట్ ఉద్యోగులకిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 7.5 శాతమే ఇచ్చిందన్నారు. కేంద్రం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటు పరమైతే.. అక్కడ రిజర్వేషన్లు ఉంటాయా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి.. ఈ ప్రాంతంలో చిన్న పనైనా చేశారా? అని ప్రశ్నించిన హరీష్… ఒక వేళ ఈటల గెలిస్తే.. వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుంది… హుజురాబాద్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుందన్నారు.