దేశానికే ఆదర్శంగా కేసీఆర్ కిట్: హరీశ్‌ రావు

40
harish

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రిక కేసిఆర్ కిట్ దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు తెలిపారు.కేసీఆర్ కిట్ కార్యక్రమం తో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగాయనీ మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు అన్నారు.

బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జనరల్ వార్డు, పిల్లల వార్డు, కరోనా టెస్టుల కేంద్రాన్ని సందర్శించారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణులతో మంత్రి ఈ సందర్బంగా మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అమ్మ ఒడి వాహన సేవలు, కే సి ఆర్ కిట్ల గురించి అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకు రావడం తో పాటు, కేసీఆర్ కిట్లు నయా పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు చెప్పారు. మగ బిడ్డ పుడితే రు. 12000, ఆడ బిడ్డ పుడితే రు. 13000 అందించడంతో పాటు, 16 వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఆటో కిరాయి ఖర్చు లేకుండా గర్భిణులు కోసం అమ్మ ఒడి సేవలు సిద్దంగా ఉన్నాయన్నారు. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.

కరోనా పరీక్ష కేంద్రం వద్ద పరీక్షలు చేస్తున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా చేస్తున్న పరీక్షలు, అందిస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కిట్ లో ఉన్న మందులను వాడుతూ దైర్యంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ, సోకిన వారు ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉందన్నారు.

అలా అని నిర్లక్ష్యం చేయవద్దని కరోనా నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సబ్ సెంటర్, పి హెచ్ సి స్థాయి నుంచి అన్ని ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచామన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో లో వంద పడకల కరోనా వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. ఆసుపత్రిలో నెలకు 400 డెలివరీ లు చేస్తున్నారనీ తెలిపారు.