సిద్దిపేట జిల్లా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ 22,23వ వార్డు పరిధి గణేశ్ నగర్లో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న యాదవ సంఘ భవన నిర్మాణానికి బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్ధిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లోని ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయుటకై చెత్తబుట్టలు, జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ : ఇప్పటికే సిద్దిపేటలో పందులను పూర్తి స్థాయిలో తొలగించి పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాం. ఇక మిగిలింది కేవలం ఈగలు, దోమలు మాత్రమే వాటిని కూడా పారదొలి ఒక మంచి సిద్దిపేటగా తయారు చేద్దాం. సిద్దిపేట పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త వేరుకోసం 38వేల చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నాం. సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రతి ఇంటీకి జూట్ బ్యాగ్ లు పంపిణీ చేస్తున్నాం. మంచి నీళ్లను చాల దూరం నుండి తెస్తున్నామని, నీళ్లను అవసరం వరకే వాడుకోండి నీటిని వృధా చేయొద్దని హితవు పలికారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలో అసలైన లబ్ధిదారులకు చేస్తాం. మరో 3 రోజుల్లో సర్వే పూర్తి కానుందని, ఉగాది నాటికి సీఎం కేసీఆర్తో ఇండ్ల గృహా ప్రవేశాలు చేపడుతాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం ఎవరికి ఒక్కరూపాయి ఇవ్వకండి, పైరవీలకు తావులేదు. నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఎవరైనా ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే వారు జైలుకు వెళ్ళాలిసి ఉంటుందన్నారు. లంచం ఇస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వమని తేల్చి చెప్పారు మంత్రి.
కాగా సిద్దిపేటలోని మరో 500ల పడకల అస్పత్రిని నిర్మాణం చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. మంచి నీళ్ల నల్లా మాదిరిగా, సిద్దిపేటలోని ఇంటింటికీ గ్యాస్ కనక్షన్ ఇస్తాం. ప్రస్తుతం పనుల నిర్మాణం ప్రారంభమైంది. నాగుల బండ వద్ద రూ.7 కోట్లతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఏర్పాటు అయ్యింది. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతున్న విషయం తెలిపారు.
మున్సిపల్ ఆర్పీలు మరింత కృషి చేయాలని సూచిస్తూ, మీలో ఇంకా పని చేయాలని ఒక ఆశయం ఉండాలన్నారు. నూతన సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను భాగస్వామ్యం చేయండని దిశా నిర్దేశం చేశారు. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రోడ్లు, భవనాలు అభివృద్ధి చేస్తే నా దృష్టిలో సరిపోదు. నా నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తాపాత్రయం అది నా బాధ్యత. అన్నింటికంటే విలువైనది మనిషి ఆరోగ్యం. నా సిద్ధిపేట ప్రజలు బాగుండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే నా ప్రధాన లక్ష్యం.
పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకూ ప్లాస్టిక్ మయంలో బతుకులు వెళ్లదీస్తున్నాం. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. రోజూ ఇంట్లో అన్నం వండుకుని కర్రీ పాయింట్స్ లో వేడి వేడిగా ప్లాస్టిక్ కవర్లలో సాంబారు, కర్రీలు తెచ్చుకుని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మంత్రి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనార్థాలు వివరించారు.
ఎక్కడ మంచి జరుగుతున్నా.. నా సిద్ధిపేట ప్రజలకు లభించాలనే ఉద్దేశ్యంతో ఇటీవల కొంతమంది కౌన్సిలర్లను బెంగళూరు నగరానికి పంపి అక్కడ అవలంభిస్తున్న విధానాన్ని సిద్ధిపేటలో అమలు చేసేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో గతంలోనే ఇంటింటికీ తడి, పొడి బుట్టలు అందించామని, ఏళ్లు గడిచాయని మళ్లీ కొత్త చెత్త బుట్టలు సిద్ధిపేట పట్టణ పరిధిలో మొత్తం 38వేల జతల రెండు బుట్టలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నాం. ఇంటింటా చెత్త సేకరణకు ఎదురవుతున్న అవాంతరాలు ఎదుర్కొనేందుకు త్వరలోనే మిడిల్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ ప్రారంభించనున్నాం.
ఇవాళ ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మీ ఇంటి ముందు ఉన్న చెట్టు సంరక్షిస్తామని, ఇంటి ముందు ఉన్న చెట్టు గురించి ఆలోచన చేయాలి. అదే విధంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని ప్రజలను మంత్రి కోరారు. ఇంటింటా సేకరించిన తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులు-వర్మీ కంపోస్టు, పొడి చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని జూట్ బ్యాగులు పంపిణీ చేస్తున్నాం. త్వరలోనే ఐటీసీ కంపెనీ ఆధ్వర్యంలో 38 వేల బ్యాగులు పంపిణీ చేయనున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.