ఈ రోజు మెదక్ జిల్లాలోని చేగుంటలో ఇతర పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీష్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీకి ఓటేస్తే మోసపోయినట్లేనని చెప్పారు. కేంద్రం ఆమోదించిన అగ్రికల్చర్ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. విద్యుత్ చట్టం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. బావుల వద్ద మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని గుర్తు చేశారు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. చేగుంటలో షాదీఖాన నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూమి పంచాయతీలను శాశ్వతంగా పరిష్కరించేందుకు డిజిటల్ సర్వే చేపడుతామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ర్టంలో రైతులు సంబురాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు ఊరురా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు చేపట్టి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రి చెప్పారు.