బీజేపీవి మాటలెక్కువ పని తక్కువ- మంత్రి హరీష్

86
- Advertisement -

మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వనపర్తి జిల్లాలో రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించి, సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నాను. రహదారుల విస్తరణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నది. సిద్దిపేటలో ఒక్క సుభాష్ రోడ్ విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు.. దానికి ఏడాదిన్నర సమయం పట్టింది. వనపర్తిలో ఆరు రహదారులు నాలుగు లేన్లుగా విస్తరణ అంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు అన్నారు మంత్రి హరీష్‌.. మంత్రి నిరంజన్ రెడ్డి కృషి అభినందనీయం..జిల్లా అభివృద్దికి కేసీఆర్ ఆశీస్సులు, నా సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వ ఆసుపత్రులలో 52 శాతానికి కాన్పులు పెరిగాయి. దేశంలో తెలంగాణ ఉత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం గుర్తించిందన్నారు.

రాష్ట్రంలో రూ. 407 కోట్లతో 23 ప్రసూతి ఆసుపత్రులు, 30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం జరిగింది. పుట్టిన పిల్లల కోసం ఎస్ఎన్ సీయూ .. 18 ఎస్ఎన్ సీయూ కేంద్రాలను ఏడేళ్లలో 65 కి పెంచాం. శిశుమరణాలను 25 శాతం నుండి 16 శాతానికి తగ్గించాం.. జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికతో ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో అభివృద్ది కుంటుపడింది. కేసీఆర్ పాలనలో పాలమూరు అభివృద్ది.. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి తెచ్చాం. ఉమ్మడి జిల్లాలో 5 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం.. అలాగే రూ. 1500 కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశాం.వీటిలో వనపర్తి, నాగర్ కర్నూలులలో వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు.

వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, గద్వాలలో ఒక్కొక్కటి రూ. 50 కోట్లతో నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేశాం. ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాలలో 5 టి డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. దేశంలో పేదలకు సేవలు అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.. బీజేపీ నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉంది. ఆరోగ్యశ్రీ కింద పేదలు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు అందుకునేలా కేసీఆర్ ఆదేశించారు. రూ.2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచారు. కరోనా నేపథ్యంలో 15 – 17 ఏళ్ల పిల్లలకు 90 శాతం మందికి వాక్సిన్ వేసి వనపర్తి జిల్లా అగ్రభాగంలో నిలిచింది. జ్వర సర్వేకు అందరూ సహకరించాలి. కోటి 27 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు రాష్ట్రంలో పంపిణీ చేశాం.. 2 కోట్ల కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలని మంత్రి సూచించారు.

కరోనా పరీక్ష కన్నా ముందు లక్షణాలు కనిపిస్తే మందులు వాడడం ప్రారంభించాలి. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండు టీకాలు తీసుకున్న వారికి కరోనా సోకినా ఇబ్బంది కలగడం లేదు. వంద శాతం వ్యాక్సినేషన్ కోసం ప్రజా ప్రతినిధులు పోటీ పడాలి. ప్రాణాలకు ఎదురొడ్డి వైద్యారోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.. ప్రజలు ప్రైవేటుకు వెళ్లకుండా.. ప్రభుత్వ వైద్యశాల సేవలు అందుకోవాలి హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సేవలు వనపర్తిలో అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తున్నారు ఒకేసారి 8 మెడికల్ కళాశాలలు కేసీఆర్ మంజూరు చేయడం చారిత్రాత్మకం అని మంత్రి కొనియాడారు.దేశంలో 157 వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. బీజేపీవి మాటలెక్కువ పని తక్కువ విమర్శించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు, వైద్యఆరోగ్య మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , కమీషనర్ వాకాటి కరుణ , గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , డీఎమ్ఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ , డీఎం & హెచ్ ఓ, తదితరులు హజరైయ్యారు.

- Advertisement -