బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ల పార్టీ బీజేపీ- మంత్రి హరీష్‌

36
Minister Harish Rao

హుజురాబాద్ లో విశ్వకర్మ మనుమయ భవనానికి శంకు స్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ ఒక్కరోజే రెండు కమ్యూనిటీ హాళ్లకు శంకు స్థాపన చేసుకున్నాం. జమ్మికుంటలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు, హుజురాబాద్‌లో విశ్వకర్మ మనుమయ సంఘం కోసం ప్రొ.జయశంకర్ భవన్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం. ఎకరం స్థలంలో కోటి నిధులతో ఈ భవనం నిర్మిస్తున్నామన్నారు. అవసరమైతే గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఫండ్స్, ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డికి వచ్చే నిధులు ఖర్చు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

విశ్వకర్మ కులస్థుల వృత్తులు దెబ్బతింటుండటంతో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నిన్నటిదాకా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్.. కల్యాణ లక్ష్మి పథకాన్ని దండుగ అన్నారు. అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అని ప్రశ్రించారు. హుజరాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇక్కడున్నవి టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే. బీజేపీవాళ్లు బొట్టుబిల్లలు, గడియారాలు ఇస్తాం, ఓటేయమంటున్నారు. వీటితో మనం బతుకుతామా?.. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదు. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని, బీసీల జనగణన చేయాలంటే చేయడం లేదు. ఇలాంటి వాళ్లు బీసీలకు న్యాయం చేస్తామంటే నమ్ముతారా? అని మంత్రి ప్రశ్రించారు.

నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది కేంద్రం ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ ధర పెంచితే.. సిలిండర్‌కు దండం పెట్టు.. బీజేపీకి ఓటేయమని అప్పట్లో మోడీ చెప్పారు. ఇప్పుడు నేను కూడా అదే చెబుతున్నా.. సిలిండర్‌కు దండంపెట్టి.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ధరలు పెంచిన బీజేపీకి బుద్ధి చెప్పాలి అన్నారు. రైల్వేలో బీజేపీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం, ధరలు పెంచడం తప్ప.. వీళ్లు చేసిందేమీ లేదని మంత్రి ఎద్దేవ చేశారు.

విశ్వకర్మలు సంప్రదాయక ఇంజినీర్లు.. వాళ్లు అద్భుత కళాఖండాలు సృష్టిస్తారు. విశ్వబ్రాహ్మణులపై దొంగబంగారం కేసులు కాకుండా, వడ్రంగులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయకుండా చర్యలు తీసుకున్నాం. కార్పోరేట్ నగల వ్యాపారుల వల్ల స్వర్ణకారుల వృత్తి దెబ్బతింది. స్వర్ణకారులను ఆదుకుంటామన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే.. ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురవుతారు తప్ప.. ప్రజలకేం లాభం అని హరీష్‌ తెలిపారు. విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇచ్చుకుందాం. ఇండస్ట్రీయల్ పార్కుల్లో విశ్వబ్రాహ్మణులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. సొంత జాగా ఉన్న వాళ్లకు విశ్వబ్రాహ్మణులకు ఇండ్లు కట్టిస్తామన్నారు.

నిన్నటిదాకా పనిచేసిన మంత్రి నిర్లక్ష్యం వల్లే ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. 17 ఏళ్లు ఈటలకు అవకాశమిచ్చారు.. ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వండి. 17 ఏళ్లలో పూర్తి కాని పనులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి చూపిస్తామన్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు.. వచ్చే అవకాశం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కోతలు, వాతలు తప్ప మనకు చేసిందేమీ లేదు విమర్శించారు. ఓటుకు 30 వేలు ఈటల రాజేందర్ ఇస్తానంటున్నాడట.. డబ్బులిచ్చే బదులు గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేలా చూస్తే మంచిది. త్వరలోనే విశ్వబ్రహ్మణులు శుభవార్త వింటారు. గతంలో తొలి స్పీకర్ అవకాశం మీ కులానికి చెందిన మధుసూదనాచారికి దక్కింది. అలాంటి అవకాశం భవిష్యత్తులో మళ్లీ వస్తుంది అని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.