సంగమేశ్వర ప్రాజెక్టు పనులపై మంత్రి హరీశ్‌ సమీక్ష..

139
- Advertisement -

సంగారెడ్డి జహీరాబాద్, ఆందోళ్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్‌లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు సర్వే పనుల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ మూడు నియోజకవర్గాలలో సుమారు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరిందించే ఈ ప్రాజెక్టు సర్వే పనులను మంత్రి హరీశ్ రావు ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 57 వేల ఎకరాలకు, ఆందోళ్ నియోజకవర్గంలో సుమారు 56 వేల ఎకరాలకు, జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు లక్షా ఆరు వేల ఎకరాలకు సాగు నీరందనుంది. ఈ ప్రాజెక్టులో రెండు పంప్ హౌస్ లను నిర్మించనున్నట్లు సాగు నీటి శాఖ అధికారులు మంత్రి హరీశ్ రావుకు తెలిపారు.

మొదటి పంపు ద్వారా ఐదులాపూర్ నుండి వెంకటాపూర్ డెలివరీ సిస్టం వరకు సుమారు 125 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోయనున్నట్లు చెప్పారు. ఈ డెలివరీ సిస్టం నుండి జహీరాబాద్, హద్నూర్, కంది కెనాల్స్ ద్వారా దాదాపు 2.,19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు. ఈ పనుల ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు విపులంగా చర్చించారు. రెండవ లిప్ట్‌ను జహీరాబాద్ కెనాల్ పై హతికుర్దు నుంచి గోవిందాపూర్ వరకు సుమారు 40 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు రెండు లక్షల 19 వేల ఎకరాలకు నీరందించే ప్రణాళికలో భాగంగా రెండవ లిఫ్ట్ ద్వారా సుమారు 42 వేల ఎకరాలకు నీరిందిస్తామని చెప్పారు.

ఈ రెండో లిఫ్ట్ ద్వారా మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలకు నీరు అందుతుందని వివరించారు. వేగంగా సర్వే పనులు ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు సాగు నీటి శాఖ అధికారులకు, కన్సల్టెంట్ ఎజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి సీ.ఈ వి. అజయ్ కుమార్, ఎస్. ఈ. మురళీధర్, జహీరాబాద్ ఈఈ ,ఎస్. సుబ్రమణ్య ప్రసాద్, సంగారెడ్డి ఈ ఈ పి. మధుసూదన్ రెడ్డి, కన్సల్టెంట్ ఎజెన్సీ ప్రతినిధి బి. మధుసూదన్ రెడి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -