వైద్య రంగంలో ఆ ముగ్గురే మూలస్తంభాలు :హరీశ్‌రావు

96
- Advertisement -

ఆశావర్కర్‌లు, ఏఎన్ఎంలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు.. వైద్య రంగానికి మూలస్తంభాలు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శంసించారు. రోగుల‌ను ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించి, అవ‌స‌ర‌మైన వైద్యం అందిస్తే, వ్యాధి ముద‌ర‌క‌ముందే రోగిని కాపాడుకోవ‌చ్చ‌న్నారు. కేవ‌లం రోగుల‌ను కాపాడిన వాళ్ల‌మే కాకుండా, రోగి కుటుంబం వైద్యం కోసం అప్పుల్లో ప‌డ‌కుండా, ఆర్థికంగా కుంగిపోకుండా కాపాడిన వాళ్లం అవుతామ‌ని హ‌రీశ్‌రావు చెప్పారు.

పీహెచ్‌సీ, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ఏఎన్ఎంలు, ఆశాల ప‌నితీరుపై నిర్వ‌హించే నెల‌వారీ స‌మీక్ష‌లో భాగంగా ఇవాళ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ న్యూట్రిషిన్ కిట్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంద‌న్నారు. 9 జిల్లాల్లో రక్త హీనత, పోషకాహర లోపం ఉన్న గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరుగుతుంద‌న్నారు. గర్భిణీ స్త్రీకి అవసరమైన స్కానింగ్‌లు చేయించాల‌ని సూచించారు. 56 టిఫా స్కాన్ యంత్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ యంత్రాలు నిర్వహించే తీరుపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. టిఫా స్కాన్ మిషన్లు వినియోగించి నాణ్యమైన వైద్యం తల్లిపిల్లకు అందించాలి. స్కానింగ్‌ల‌ కోసం బయటకు వెళ్లకుండా చూడాల‌న్నారు. డెలివరీ తేదీని ముందే గుర్తించి 104 వాహనంలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాల‌ని సూచించారు.

నిజామాబాద్, సూర్యాపేట‌, హ‌నుమ‌కొండ‌, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్, మంచిర్యాల జిల్లాల్లో ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లోనే అధికంగా డెలివ‌రీలు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో 45 శాతానికి పైగా డెలివ‌రీలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. మెద‌క్ జిల్లాలో 80 శాతం డెలివ‌రీలు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోనే జ‌రుగుతున్నాయ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

మెద‌క్, ములుగు జిల్లాల్లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో 80 శాతం డెలివ‌రీలు జ‌రిగిన‌ప్పుడు, మిగ‌తా జిల్లాల్లో ఎందుకు జ‌ర‌గ‌డం లేదు. ఈ అంశంపై డీఎంహెచ్‌వోలు, సూపర్ వైజర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు దృష్టి సారించాల‌ని ఆదేశించారు. కొత్తగా ఎంసీహెచ్ ఆస్ప‌త్రులు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లోనే వందకు వంద శాతం డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నార్మ‌ల్ డెలివ‌రీలు చేయ‌డానికే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -