తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్‌లో మంత్రి హరీష్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, డెరెక్టర్ హెల్త్ జి. శ్రీనివాస్‌రావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాథర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబరు మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ ప్రోగ్రాం ప్రారంభించేలా సిద్దం కావాలి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫెర్ కమిషనర్ వాకాటి కరుణ, డెరెక్టర్ హెల్త్ శ్రీనివాస్‌రావు, ఓఎస్డీ గంగాధర్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి, ఆ జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి అవసరమైన సన్నాహక ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి అన్నారు.
తెలంగాణ హెల్త్ పోఫైల్‌లో ప్రస్తుతం, ఎనిమిది టెస్ట్‌లు చేస్తున్నారు, అదే తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా అయితే 57 టెస్ట్‌లు చేయవచ్చని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అని మంత్రి సూచించారు. తెలంగాణ డయాగ్నసిస్‌లో ఉపయోగించే ఎక్విప్మెంట్ ద్వారా ఆక్యురేట్‌గా రిజల్ట్ వస్తాయి. వేగంగా పరీక్షలు నిర్వహించి రోజుకు పది టెస్ట్‌లు చేయవచ్చు… ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారం తీసుకోవాలి. నోడల్ ఆఫీసర్లను నియమించి వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రయోగాత్మకంగా హెల్త్ ఫ్రోఫైల్ ఎలా తయారు చేయనున్నారో, ఆ వివరాలను మంత్రికి తెలిపారు అధికారులు.
ఈ జిల్లాలలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, సుగర్ బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం వల్ల వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అసెస్మెంట్, హై రిస్క్ వాళ్లను గుర్తించడం జరుగుందన్నారు. అనంతరం వారికి అవసరమైవ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలు పూర్తయిన వారి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజి చేస్తారని, అందులో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా నిక్లిప్తం చేయటం జరుగుతుందని వివరించారు.
ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో చేపట్టే ఈ ఆరోగ్య సమాచార సేకరణ పక్కాగా ఉండాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఏ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినా, లేదా ఏ వ్యక్తి యాక్సిడెంట్ కు గురయినా అతని ఆరోగ్య సమాచారం అంతా క్లౌడ్ స్టోరేజ్ నుండి తెప్పించుకునేలా ఉండాలి. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ సమాచారం పకడ్బందీగా సేకరిస్తే ప్రభుత్వం సమర్ధవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నదే సీఎం ఆలోచన. సమాచారం పక్కాగా ఉంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాంతంలోఎలాంటి వైద్య సేవలు అవసరం, ఎలాంటి మందులు అవసరం, ఎలాంటి వైద్య నిపుణులు, అవసరమైన మెడికల్ డివైసెస్ అవసరమో తెలుస్తుందని మంత్రి అన్నారు.