మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు..

122
- Advertisement -

పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా మొత్తం 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నది. మంగళవారం ఎంసిహెచ్ఆర్డిలో వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా పట్టణాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటు గురించి చర్చించాయి. ఈ సమీక్షలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీఎం ఓఎస్డి గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీ ఎస్ టీ ఎస్ వెంకటేశ్వర్ రావు, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని, ఇదే స్ఫూర్తితో 141 మున్సిపాలిటీల్లో మరో 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు దశల్లో వచ్చే జూన్ 2 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 544 బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనాభా సంఖ్య, వైద్య సేవల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ శాఖ మౌలిక సదుపాయాలను, ఆరోగ్య శాఖ వైద్య పరికరాలను సమకూర్చుతుందన్నారు. టీ డయాగ్నొస్టిక్ సహకారంతో కొత్తగా ఏర్పాటు చేసే బస్తీ దవాఖానల్లో ఎక్కడిక్కడే శాంపిల్స్ సేకరణ ఉంటుంది అన్నారు. ఉచిత వైద్యం, ఉచిత మందులతో పాటు, రోగ నిర్ధారణ పరీక్షలకు చేసే ఖర్చు కూడా పేదలకు తప్పుతుందని మంత్రి చెప్పారు.

ఆరోగ్య శాఖకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు…

నీతి అయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం పట్ల మంత్రి హరీశ్ రావు, ఆరోగ్య సిబ్బందికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడు ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షత వల్ల ప్రభుత్వ వైద్య రంగం ముందుకు దూసుకు వెళ్తుంది అన్నారు. గతేడాది 4వ స్థానం నుండి.. ఈ ఏడాది 3 వ స్థానానికి చేరడం అభినందనీయం అన్నారు. వచ్చే ఏడాది ఆరోగ్య సూచిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. బస్తీ దవాఖానల పనితీరు బాగుందని, తమ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని చాలా వినతులు వస్తున్నాయన్నారు. ఐటీ శాఖ నుండి వైద్యారోగ్య శాఖకు అవసరమైన సాంకేతిక సమాచారం అందిస్తామన్నారు.

- Advertisement -