జర్నలిస్టులు కలం సైనికులు- మంత్రి హరీశ్‌

68
- Advertisement -

హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎస్ఎన్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ జర్నలిస్టులకు, కవులకు అవార్డుల ప్రదానోత్సవ సభలో మంత్రి హరీశ్‌ ముఖ్య అథితిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి మాత్రమే కాదు.. సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత గల వారిని గుర్తించి గౌరవించడం గొప్ప విషయం అన్నారు. మీడియా అంటే కేవలం వార్తలు కాదు. ఒక గొప్ప సామాజిక మార్పు కోసం మీడియా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ప్రజలను చైతన్య పరుస్తూ ఉంటుంది. మానవీయ కథనాలు రాసిన అనేక మంది జర్నలిస్టులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు మంత్రి.

వార్తలను ప్రజల వరకు చేర్చడానికి, వాస్తవాలను నిగ్గు తేల్చడానికి జర్నలిస్టులు ఎంత రిస్క్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రాణాలను పణంగా పెడతారు. భూకంపాలు, తుఫాన్లు, సునామీల వంటి విపత్తుల సమయంలోనూ వెన్ను చూపకుండా క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ప్రజలకు అందించేది జర్నలిస్టులు. అంతెందుకు.. యుద్ధం గనుక వస్తే యుద్ధరంగంలో కనిపించేది ఇద్దరే. ఒకరు సైనికులు. మరొకరు జర్నలిస్టులు. రష్యా ఉక్రెయిన్ యుద్ద సమయంలో మొన్న కూడా మనం కళ్ళ నిండా చూశామని మంత్రి గుర్తు చేశారు. ఇక జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. నా వంతు ముందుకు తీసుకు వెళ్లేలా ప్రయత్నం చేస్తాను అన్నరు. ఇటీవల ఎంబీబీఎస్ సీటు వచ్చినా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని వార్త వచ్చింది. టాలెంట్ ఉన్నవారికి పేదరికం అడ్డు కావద్దని కాళోజీ వర్సిటీ వీసీతో సమీక్ష చేసి అలాంటి వారికి సాయం చేసేందుకు రూ.10 కోట్ల నిధులు పెట్టుకున్నాం. మీ వార్తే దానికి మూలం అని మంత్రి కొనియాడారు.

ఇటీవల కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు.. ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన సందర్భంలో జర్నలిస్టులు మాత్రం ఫీల్డ్ లోనే ఉన్నారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో, ప్రభుత్వాలను అధికారులను అప్రమత్తం చేయడంలో, లక్షల మంది ప్రాణాలను కాపాడడంలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్షణాల్లో ప్రజలకు చేర్చింది. ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూపించింది. ఈ క్రమంలో ఎంతోమంది మీడియా మిత్రులు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు వదిలారు. అయినా జర్నలిస్టులు తమ సామాజిక బాధ్యతను విస్మరించలేదు. కరోనా వారియర్లుగా నిలిచిన జర్నలిస్టులందరికీ ఈ సందర్భంగా నా అభినందనలు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.

వార్తలంటే ప్రెస్మీట్లు, ప్రెస్ నోట్లు, సభలు, సమావేశాలు మాత్రమే కాదు. ఆపదలో ఉన్న ప్రజల బాధలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తేవడం, వాటిద్వారా సమాజాన్ని మేల్కొల్పడం తమ ప్రథమ కర్తవ్యమన్న విషయాన్ని జర్నలిస్టులు మరచిపోరాదు. సమాజాన్ని జాగృతం చేసిన కథనాలను గుర్తించి.. జర్నలిస్టులను సత్కరిస్తుండటం గొప్పవిషయం. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ కు అభినందనలు. అవార్డు గ్రహీతలు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ మానవీయ విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి కృషిచేయాలని ఆకాంక్షిస్తున్నాను.

మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత టి.ఎస్.పి.ఎస్.సి. సభ్యులు ఆర్. సత్యనారాయణ దాదాపు మూడు దశాబ్దాల పాటు జర్నలిజం వృత్తిలో కొనసాగారు. తన కలాన్ని నోరులేని ప్రజలకు అంకితం చేశారు. ఆదర్శ పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు.ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ను స్థాపించి సామాజిక సేవను కొనసాగిస్తుండటం ప్రశంసనీయం. భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు జర్నలిస్టుల సంక్షేమ నిధి పేరుతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ నిధికి సుమారు రు. 42 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేసింది. దాదాపు 4వేల మంది మీడియా మిత్రులకు ప్రభుత్వం 5.60 కోట్ల రూపాయలను అందజేసింది. మొత్తంగా ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 16 కోట్ల 11 లక్షల రూపాయలను ఆర్థిక సాయం గా అందజేసింది.

ఒకప్పుడు అక్రిడేషన్లు కొందరికి మాత్రమే పరిమితం. మహా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలిపితే రెండు మూడు వేలకు మించి ఉండేవి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్కింగ్ జర్నలిస్టులందరికీ హోదాతో సంబంధం లేకుండా అక్రిడేషన్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటివరకు జారీ చేసిన అక్రిడేషన్లు 19,735. జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఉచితంగా చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టి హెల్త్ కార్డులు అందజేసింది. వైద్య చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూపించాలి. ఆరోగ్యమే మహా భాగ్యం. రోజూ కొంత సమయం ఆరోగ్యం కోసం కేటాయించాలి అన్నారు.

కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు, ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ట్రస్టీ సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు రామ చంద్ర మూర్తి, ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ విరహత్ అలీ, తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నందిని సిధా రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ దేవి ప్రసాద్ రావు, టీఎస్పీఎస్సీ సభ్యులు కారెం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -