సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ళ గ్రామంలో మంగళవారం శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవి నిత్యాన్నదాన సత్రంను హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితెల సతీశ్ తో కలసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే, హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుంది అన్నారు.
పొట్లపల్లి శ్రీ స్వయం భూరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికై ముర్రంశెట్టి రాములు తండ్రి పరితపించే వారని, ఆకలి అయిన వారికి అన్నం పెట్టి మంచిపేరు గడించారు. పది మందికి ఉపయోగకరమైన సేవ చేస్తున్న స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవి నిత్యాన్నదాన సత్రంకు శాశ్వత నిధిలో భాగస్వామిగా తన నెల వేతనాన్ని ట్రస్టుకు అందిస్తున్నాను అని మంత్రి ప్రకటించారు. హుస్నాబాద్ లో 10 కోట్లతో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని.. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. అలాగే నియోజకవర్గంలో ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె ఆసుపత్రులుగా త్వరలో అప్ గ్రేడ్ చేస్తామని..ప్రతీ ఏఎన్ఏం సబ్ సెంటరుకు 20 లక్షలు నిధులు కేటాయింపు చేస్తామని తెలిపారు.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్నీ తండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేయిస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా మిల్లర్లపై రైడింగ్ పేరిట వేధింపులకు గురి చేస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనుగోళ్లు పూర్తి చేస్తున్నది. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్ ఘర్ లలో బీజేపీ, కాంగ్రెస్ పాలన ఉన్నా కానీ కనీసం వడ్లు కొనే పరిస్థితి లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల నుంచి వడ్లు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కంటే మన తెలంగాణ రాష్ట్రంలో 500 ఎక్కువ వస్తున్నాయని వడ్లు విక్రయాలు చేసుకునేందుకు తెలంగాణకు వస్తున్నారని మంత్రి తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బండి సంజయ్ ఒకవైపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరోవైపు పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి హరీశ్ రావు ఎద్దేవ చేశారు.