సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో యాసంగి పంటల సాగు ప్రణాళిక, వానాకాలం పంటల కొనుగోలు కార్యాచరణపై జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు ఈ సమావేశానికి హాజరైయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలోని సింగూర్, నల్లవాగు ప్రాజెక్టులు నిండు కుండలా ఉన్నాయన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 54లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 79200 ఎకరాల్లో వరి సాగు అయ్యింది. చేగుంట మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని గమనించాను. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు, గన్నీ బస్తాలు, శుభ్రపరిచే యంత్రాలను అధికారులు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఎత్తైన ప్రదేశంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యం ఆరోజే గోదాములకు, మిల్లులకు చేరాలి. మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలి. 17శాతం లోపు తేమ శాతంతో ధాన్యం తీసుకొస్తే 24గంటల్లో కొనుగోలు చేస్తాం. 72గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి ప్రతిపాదనలు వస్తే రేపే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయ్యండి అని మంత్రి హరీష్ రావు తెలిపారు.