వైద్యారోగ్య రంగంలో తెలంగాణ నంబర్ 1- మంత్రి హరీష్‌

92
Minister Harish
- Advertisement -

సీఎం కేసీఆర్‌ మార్గర్దేశంలో తెలంగాణ వైద్యారోగ్య రంగంలో దేశంలో నంబర్‌ వన్‌ స్థానానికి చేరుతున్నదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పురస్కారాలే స్పష్టం చేస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. నీలోఫర్‌ ఆసుపత్రిలో అధునాతన సిటీస్కాన్‌, నియొనాటల్‌ స్కిల్‌ ల్యాబ్‌ను మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు.

అనంతరం మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక తలసరి ఆరోగ్య వ్యయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్లు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసిందన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1,698 ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెల్నెస్ యాక్టివిటీస్‌లో తెలంగాణను నంబర్ వన్‌ రాష్ట్రంగా కేంద్రం గుర్తించిందన్నారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో ఉన్నామని, కేంద్రం మూడు అంశాల్లో అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణకు రెండు వచ్చాయన్నారు. ఇదే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పని తీరు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పని చేస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స చేయాలని నీలోఫర్ డాక్టర్లకు సూచించినట్లు చెప్పారు. కర్ణాటక నుంచి కొందరు సిఫారసుపై వస్తున్నారన్నారు. వారందరికీ ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందించాలని చెప్పానన్నారు.

నీలోఫర్‌లోని ఎనిమిది హెచ్ఓడీల వారీగా సమీక్షించామని, కావాల్సిన పరికరాలను సమకూర్చాలని టీఎస్ఎస్ఎంఐడీసీ ఎండీని ఆదేశించామన్నారు. సెల్ఫ్ అప్రైజల్ ఇవ్వాలని డాక్టర్లకు సూచించామని, ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, అందులో ఎంత మేర సాధించారో నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రతినెలా కచ్చితంగా పురోగతి ఉండాలని స్పష్టం చేశామని, నెలనెలా సమీక్ష చేస్తామని.. జీతాలు, మందులు, రియేజెంట్ల విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఆసుపత్రికి ప్రతి సంవత్సరం ఆరోగ్యశ్రీ కింద రూ.10 కోట్లు వస్తున్నాయన్నారు. వీటిని హాస్పిటల్ అభివృద్ధికి వినియోగించేలా సూపరింటెండెంట్ ఆదేశాలిచ్చామన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కుటుంబానికి రూ.2లక్షలు ఉంటే సీఎం కేసీఆర్‌ రూ.5 లక్షలకు పెంచారన్నారు. ఆ అవకాశాన్ని ఉపయోగించాలని సూచించారు. ప్రతి నెల రివ్యూ చేయాలని డీఎంఈకి సూచించామని, ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు సైతం ఓపీలో కూర్చోవాలని ఆదేశాలిచ్చినట్లు వివరించారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య శాఖ అభివృద్ధి సాధించిందన్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. మాతృ మరణాలు 92 నుంచి 63కు, శిశు మరణాలు 39 నుంచి 26కు, ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 42 నుంచి 29కి, నవజాత శిశు మరణాలు 25 నుంచి 16కు తగ్గాయన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30 నుంచి 52 శాతానికి పెరిగింది.నార్మల్ డెలివరీలు పెరగాలని స్పష్టంగా చెప్పామని, నార్మల్ డెలివరీలు పెరిగేలా నర్సింగ్ స్టాఫ్‌లో 30 మందికి మిడ్ వైఫరీ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించామని, కేసీఆర్‌ కిట్, అమ్మఒడి వంటి పథకాలతో దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య 97శాతానికి పెరిగిందని మంత్రి వివరించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని మంత్రి స్పష్టం చేశారు. రిస్క్ దేశాలనుంచి వచ్చిన 15 మందికి పాజిటివ్ రాగా.. అందరికీ ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చిందని, వాక్సినేషన్‌పై ప్రజలకు మరింత అవగాహన పెంచేలా మీడియా కథనాలు పెంచాలని సూచించారు. మొదటి డోస్ 97శాతం, రెండో డోస్ 53 శాతానికి జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని కోరారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లో పారిశుధ్యం పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరిగా పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నట్లు హెచ్చరించారు. నిలోఫర్‌లో కార్డియాలజీ లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపారని, దీనిపై ఒక కమిటీ వేసి, వారంలో నివేదిక ఇవ్వాలని చెప్పామన్నారు. డీపీహెచ్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మంగళవారం ములుగు, సిరిసిల్ల వెళ్తున్నారని, వారిచ్చే నివేదిక ఆధారంగా త్వరలో హెల్త్ ప్రొఫైల్ స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

- Advertisement -