బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి గంగుల సమీక్ష..

79
minister gangula

తెలంగాణ ప్రభుత్వం సెలూన్లకు, లాండ్రీలు, దోబీఘూట్లకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం కల్పించినందుకు, కరోనా కష్టకాలంలో అర్థాకలితో అలమటిస్తున్న కులవృత్తి చేసుకునే రజకులు, నాయీబ్రాహ్మణులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఆయా సంఘాల ప్రతినిధులు తమ క్రుతజ్ణతలు తెలియజేశారు. గతంలో ఇచ్చిన నిబందనల్లో కొన్ని అంశాలు ఇబ్బందికరంగా ఉండడంతో వాటిని సరళతరం చేయాలని కోరుతూ తెలంగాణ రజక సంఘాల సమితి, నాయీబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు గత కొన్ని రోజులుగా వివిద సందర్భాల్లో మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి వినతులు సమర్పిస్తున్నారు. సేవావృత్తిగా రజక, క్షుర వృత్తిని చేపట్టామని, మా అభివృద్దిని ఆకాంక్షిస్తున్న ప్రభుత్వం తమని సేవా కేటగిరి కింద పరిగణించాలని కోరారు. ఈ ఇబ్బందుల్ని అదిగమించేందుకు మంత్రి ఈ రోజు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణులు, రజకులు కోరుతున్న పలు అంశాలను చర్చించారు, ప్రధానంగా గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 2 లో ఉచిత విద్యుత్‌ను కమర్షియల్ కాటగిరీలా కాకుండా సేవా విబాగం కింద ప్రత్యేకంగా గుర్తించాలని, చాలా మంది రజకులు తమ సొంత ఇంట్లోనే లాండ్రీ పనులు చేసుకుంటున్నందున, సెలూన్లు సైతం అలాగే ఉన్నందున లేబర్ లైసెన్స్ లేదా మున్సిపల్, గ్రామ పంచాయితీ లైసెన్సులు, రెంటల్ అగ్రిమెంట్ల నుండి మినహాయించాలని, అలాగే మూడు నెలల పవర్ బిల్లుల అడ్వాన్స్ చెల్లింపుల నుంచి మినహాయింపు నివ్వాలని, 250 యూనిట్లు దాటిన తర్వాత సైతం దోబీఘూట్లకు ఎల్ టి 4 కింద కాకుండా యూనిట్కి 2రూపాయలు చార్జీ వర్తింపజేయాలని, సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లకు వ్యక్తిగత ద్రువీకరణతో అనుమతించాలని వారు ప్రధానంగా మంత్రిని కోరారు.

ఈ సమస్యల పట్ల గతంలోనే సానుకూలంగా స్పందించిన మంత్రి రజకుల, నాయీభ్రాహ్మణులు ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ఈరోజు ఉన్నతాధికారులతో చర్చించారు. గతంలో ఇచ్చిన నిబందనల విషయంలో పూర్తి స్థాయిల్లో ఇబ్బందుల్ని తొలగించి నూతన విదానాల కోసం ఈనెల 11న ఖైరతాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులు, రజక, నాయీబ్రాహ్మణ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రజకులు, నాయీబ్రాహ్మణులు సైతం కేవలం అర్హులకే ఈ పథకం అందేలా జాగ్రత్తలు వహించాలని, అనర్హులఫై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారధర్శకంగా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యధర్శి బుర్రా వెంకటేశం, రజక ఫెడరేషన్ ఎండి చంద్రశేఖర్, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఎండి విమలా దేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.