కార్పోరేట్‌కు దీటుగా సర్కారు గురుకులాలు- మంత్రి గంగుల

101
Minister gangula

ఒకనాడు సర్కారు బడి అంటే సమస్యలకు నిలయాలుగా దర్శనమిచ్చేవి, కానీ స్వరాష్ట్రంగా తెలంగాణ అవతరించాక ఆ పరిస్థితుల్లో సమూలమైన మార్పులు చోటుచేసుకుంటన్నాయి. సంక్షేమ గురుకులాల్ని ఏర్పాటు చేసి, ఎస్సీ,ఎస్టీలతో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తోడ్పాటుతో, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విజనరీతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం ఆధ్వర్యంలో గురుకులాలు ప్రగతి దిశలో పయనిస్తున్నాయి. విద్యతో పాటు మానసిక వికాసం, శారీరక దారుడ్యం, క్రీడోల్లాసం, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి సమగ్ర అంశాల మేలవింపుతో విధ్యార్థులకు అత్యుత్తమ సుశిక్షణను అందిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 261 స్కూళ్లు, 19 జూనియర్ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ మెత్తం 281 గురుకులాల్లో సకల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈసంవత్సరం మరో 119 జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తుంది. ప్రతీ బిసి గురుకులంలో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేసుకొని వందకు వందశాతం డిజటలైజేషన్ బిసి గురుకులాలు సాధించాయి, విద్యా ప్రమాణాల్ని పెంచడం వల్ల క్యాంపస్ రిక్రూట్మెంట్లలోనూ దూసుకుపోతున్నాయి, తాజాగా ఆర్మీ, నేవీల్లోనూ బిసి గురుకుల విద్యార్థులు సెలక్టయిన విషయం తెలిసిందే. అనేక విద్యాలయాల్లో వందకు వంద శాతం రిజల్ట్ తో రాష్ట్ర సగటును మించి ఉత్తీర్ణతా శాతాన్ని సాధిస్తూ గురుకులాల విద్యార్థులు సొసైటీ పేరును నిలుపుతున్నారు. ప్రభుత్వం సైతం వందల కోట్ల నిధులతో గురుకులాలను అభివ్రుద్ది చేస్తూ విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పిస్తుంది.

తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌తో జరిగిన సమీక్షా సమావేశంలో వీటి గురించిన ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తిచేసిన కమలాపూర్ గురుకుల విద్యాలయం నిర్మాణం కార్పోరేట్ కు దీటుగా నిలవడాన్ని మంత్రి అభినందించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం కృషిని కొనియాడారు. 15 ఎకరాల సువిశాల విస్థీర్ణంలో 1,10,000 వేల చదరపు అడుగులతో స్కూల్ చాలా చక్కగా ఉందని, 20 కోట్లు వెచ్చించి బిసి విద్యార్థులకు సకల సౌకర్యాలను సమకూర్చడం ఆనందంగా ఉందన్నారు, స్కూల్ భవనాలు, స్టాప్ క్వార్టర్స్, డైనింగ్ ఏరియా, లైబ్రరీ, లాబరేటరి, విశాలమైన ఆటస్థలం అన్నింటి కన్నా ముఖ్యంగా అహ్లదకరంగా తీర్చిదిద్దిన పచ్చని వాతావరణం చదువులతో పాటు మానసికోల్లాసాన్ని అందించే విదంగా తీర్చిదిద్దినందుకు అధికారుల్ని అభినందించారు.

మరో 25 గురుకులాలు సైతం ఇదే రీతిలో నిర్మాణ దశలో ఉన్నాయని రాబోయే రోజుల్లో అన్ని గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణంతో పాటు సమగ్ర మౌళిక వసతులను అందిస్తామన్నారు. తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆనందం వెలిబుచ్చారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి మనకుండడం వల్లనే ఇది సాద్యమయిందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో అన్ని రంగాల్లో తెలంగాణ రాణిస్తుందని అందుకు ఈ పురోగతే నిదర్శనమన్నారు మంత్రి గంగుల.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బిసి గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు తదితర అధికారులు పాల్గొన్నారు.