అన్నదాతాలు ఆందోళన చెందవద్దు- మంత్రి గంగుల

104
minister gangula
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అకాల వర్షాల ప్రభావం రైతాంగంపై పడకుండా పౌరసరఫరాల శాఖ పకడ్బంది చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను అప్రమత్తం చేయడం జరిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు, అధైర్య పడవద్దు, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తోందన్నారాయన. ఇది రైతు ప్రభుత్వమని, రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.

ఈ యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవడానికి భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) అంగీకరించింది. అంతకు మించి వచ్చినా కూడా కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటి వరకు 1.40 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,740 కోట్ల విలువ చేసే 19.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,183 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించగా ఇప్పటి వరకు 6, 144 కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని గంగుల తెలియజేశారు.

ధాన్యం దిగుబడులకు అనుగుణంగా ప్రాధ్యానత క్రమంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకునేలా ఆదేశించామన్నారు మంత్రి. ధాన్యం కొనుగోళ్ల కోసం 10.80 కోట్లు కొత్తవి, 9.20 కోట్లు పాత గన్నీ సంచులు అవసరంకాగా 14.73 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని. మరో 40లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు మంత్రి గంగుల. రాష్ట్రంలో ఎక్కడ కూడా గన్నీ సంచుల కొరత లేదు.

ధాన్యం కొనుగోళ్ల కోసం 15వేల కోట్ల రూపాయలు అవసరమని, ఈ నిధులను గౌరవ ముఖ్యమంత్రిగారు పౌరసరఫరాల సంస్థకు ముందుగానే సమకూర్చడం జరిగింది. ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి నిధుల సమస్యగానీ, గన్నీ సంచుల సమస్యగానీ లేదని, తెలంగాణ రైతాంగానికి పూర్తి అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని, కోవిడ్ క్లిష్ట సమయంలోనూ క్షేత్ర స్థాయిలో పౌరసరఫరాల సిబ్బంది నిరంతరం అందుబాటులోనే ఉంటారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

- Advertisement -