దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష..

38
modi

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, డాక్టర్ హర్ష్ వర్ధన్, పియూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరైయ్యారు. ఈ సమావేశంలో ప్రధానికి రాష్ట్రాల వారీగా, జిల్లా వారీగా కోవిడ్ పరిస్థితిపై పూర్తి సమాచారం అందించారు అధికారులు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టీవ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి రాష్ట్రాలకు సహాయం, మార్గదర్శకత్వం కల్పించాలని ప్రధాని నిర్దేశం చేశారు. సమగ్రంగా, వేగవంతమైన కరోనా నియంత్రణ చర్యలపై సమావేశంలో చర్చించారు.

కోవిడ్ పాజిటివిటీ 10% దాటితే లేదా ఆస్పత్రుల్లో 60% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటే ఆందోళనకర జిల్లాలుగా గుర్తించాలని రాష్ట్రాలకు సూచించినట్లు అధికారులు తెలిపారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మందుల లభ్యత, టీకా డ్రైవ్ పై సమీక్ష నిర్వహించారు ప్రధాని. రెమ్‌డెసివిర్‌తో సహా ఇతర ఔషధాల ఉత్పత్తి వేగం పెంచేందుకు తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించారు.ఇప్పటివరకు రాష్ట్రాలకు 17.7 కోట్ల వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందించినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్ వేస్టేజ్ పైన ప్రధాని సమీక్షించారు. 45 ఏళ్ళు దాటిన సుమారు 31% మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకున్నట్లు అధికారులు ప్రధానికి వివరించారు. వ్యాక్సినేషన్ వేగం తగ్గకుండా చూడాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పౌరులు టీకా కోసం సదుపాయం కల్పించాలని సూచించారు. టీకా డ్రైవ్ లో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదని ప్రధాని సూచన చేశారు.