నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్రాణాలు పోతున్నాయి- మంత్రి ఈటల

136
minister etala
- Advertisement -

క‌రీంన‌గ‌ర్ జిల్లా ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ప్రారంభించారు. అనంత‌రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కోవిడ్ -19 స్థితిపై ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ లు కనుమల్ల విజయ, పుట్ట మధు, ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ శశాంక మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ అనేది ఓ వింత రోగం అని.. దీని ప‌ట్ల ఎవ‌రూ నిర్ల‌క్ష్యం వ‌హించొద్ద‌ని అన్నారు. గాలిలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్నందున అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇదొక వింత రోగం. ఏం ల‌క్ష‌ణాలున్నా వైద్యుల‌ని క‌ల‌వాలి. ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు ఆల‌స్య‌మైతే.. ల‌క్ష‌ణాలు ఉంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్రాణాలు పోతున్నాయి. వైర‌స్ సోకిన కొంద‌రిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ఆ వైర‌స్ ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం చూపి, క్ష‌ణాల్లో ప్రాణాల‌ను తీస్తుంద‌న్నారు. పాజిటివ్ అని తెలిస్తే.. నిర్ల‌క్ష్యం చేస్తున్న‌వారే మ‌ర‌ణిస్తున్నారు అని ఈట‌ల పేర్కొన్నారు.

రాష్ర్టంలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త లేదు అని మంత్రి ఈట‌ల స్ప‌ష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లోనూ ఆక్సిజ‌న్ కొర‌త తీరుతుంద‌న్నారు. మ‌న‌కు ఆక్సిజ‌న్‌ను విశాఖ నుంచి కేటాయించ‌లేదు. 1300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఒడిశా నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజ‌న్‌ను తెప్పిస్తున్నామ‌ని తెలిపారు. తెలంగాణలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదని, పడకలు, టీకాలు, మందులూ అన్నీ అందుబాటులోనే ఉన్నాయని ప్రకటించారు. కరోనాను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై మాత్రం చర్యలు తప్పవని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

- Advertisement -