తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల క్రమంగా పెరుగుతున్నాయి.ఈ సంఖ్య ప్రస్తుతం 77కు చేరుకుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్‌లో మత ప్రార్థనలకు హాజరై రాష్ట్రానికి వచ్చిన వారు, వారి బంధువుల్లో 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. దీంతో ఈ రోజు కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ నుంచి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.
కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు వారి బంధువులను కూడా పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకురావాలన్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు. అదేవిధంగా గర్బిణీలకు ఇబ్బందులు లేకుండా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు పని చేస్తాయని మంత్రి వెల్లడించారు. ఇక డయాలసిస్, తలసేమియా, సికెల్‌సెల్ జబ్బులున్న వారికి రక్త మార్పిడి అవసరమవుతుంది. కావునా వీరు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం ఇటువంటి జబ్బులున్నవారి ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకోవద్దన్నారు మంత్రి ఈటెల.