కరోనాను పూర్తిగా నియంత్రించే వరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ప్రాథమిక దశలోనే కరోనా గుర్తించి వైద్యం అందించేందుకు గ్రామ స్థాయి లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జ్వరం వచ్చిన వారిని సబ్ సెంటర్లో స్థాయిలోనే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి అక్కడే వైద్య పరీక్షలు ,కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా ఉందా లేదా అని నిర్ధారణ చేస్తామని తెలిపారు పాజిటివ్ ఉండి లక్షణాలు లేని వారినీ హోమ్ ఐసొలేషన్ ఉంచి చికిత్స అందిస్తామని, అవసరమైన వారినీ పెద్ద ఆసుపత్రులకు తర లిస్తామని మంత్రి అన్నారు.
కరోనా మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ప్రజలను బ్రతికించడానికి భూమి మీద ఎక్కడ మందులు ఉన్నా తీసుకొని రమ్మని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు ఆదేశించారు.. ఆ మేరకు మందుల కొరత లేకుండా చూస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.ఎంత ఖర్చు అయినా కూడా ప్రోక్యూర్ చేస్తామని తెలిపారు.
కరోనా మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు, సప్లై చేస్తున్న డీలర్లతో ఈరోజు బి ఆర్ కే ఆర్ భవన్లో మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు.ఎట్టిపరిస్థితుల్లో కరోనా కు అవసరమైన మందులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గ్రామస్థాయి నుంచి ప్రతి మందుల షాప్ లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి విధిగా కరోనా మందులు సరఫరా చేయాలని కోరారు
ఎక్కువ ఖరీదు ఉన్న మందులు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.వీటితోపాటు కరోనా చికిత్సకు అవసరమైన అత్యవసరమైన మందులు, ఇంజెక్షన్లు వివరాలు:
- Antibiotics – Azithromycin or Doxycyline or Amoxycillin with clavulanic acid or cefixime or ceofotaxime
- Cetrizine or flexofandine
- Paracetomol
- Dexamethasone or Methyl prednosolone
- Multivitamins – Zinc /vitaminC /Vitamin D
- Cough syrups – Benadryl / Ambroxyl
- Hydroxychloroquine
ఈ మందులు అన్నిటినీ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతి మీనా, అధికారులను కోరారు.వైరస్ లోడ్ ను తగ్గించడానికి వినియోగిస్తున్న రేమెడేస్విర్ మందును తయారు చేస్తున్న హెట్రో కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడారు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మందులను సప్లై చేయాలని కోరారు. కాబట్టి త్వరలోనే ఆ మందు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు.
ప్రజల ప్రాణాలను కాపాడటం లో టేర్శరీ కేర్ ఆసుపత్రులు ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న అన్ని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్ లతో కోటి లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు మంత్రి సమీక్ష నిర్వహించారు.ఆసుపత్రుల వారీగా ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు. అవసరం అయిన సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని సూపరిండెంట్లకే ఇచ్చారు. సిబ్బంది, పరికరాలు అడిగిన 24 గంటల్లోనే ఇస్తామని హామీ ఇచ్చారు.
టీం వర్క్ తో పనిచేసి ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్ కి వచ్చిన ఏ ఒక్క పేషంట్ నీ కూడా వెనక్కి తిరిగి పంపించ కూడదని.. ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన హాస్పిటల్ కి పంపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రులు చుట్టూ పేషెంట్లు తిరుగుతున్నారు అంటూ వస్తున్న వార్తలకు స్వస్తి పలకాలని తెలిపారు.
ఉస్మానియా ఆసుపత్రి పై కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. హైటెక్ యుగంలో పురాతన కట్టడాలతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని ప్రజలు ప్రాణాలు హరించే విధంగా ఉన్నా ఉస్మానియా ఆసుపత్రిని ఆధునీకరించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు.