రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సిఇఓలు, డిపిఓలతో హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జెడ్పీ లో గల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ లో మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం మన రాష్ట్రంలోనే అమలవుతున్నదన్నారు. సిఎం కెసిఆర్ రూపొందించి అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డులు, వైకుంఠ ధామాలు, కల్లాలు, రైతు వేదికలు, హరిత హారం మొక్కల పెంపకం అన్ని కార్యక్రమాలు సజావుగా అమలు జరిగి తీరాలన్నారు. నిర్ణీత లక్ష్యాలకనుగుణంగా పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతువేదికలు సాధ్యమైనంత వేగంగా పూర్తికావాలన్నారు. అలాగే వర్షాకాలసీజన్ ముగిసి, పంటలు కోసి, వర్షాలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన లక్ష కల్లాల టార్గెట్ ని కూడా అధికారులుపూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డులను పూర్తి చేసి, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలన్నారు. ఇక వైకుంఠ ధామాలు పని చేయడం ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ మంచి నీటిని మిషన్ భగీరథ కింద తీసుకోవాలని చెప్పారు. ఆయా నిర్మాణాలన్నింటికీ, ప్రహారీలను బాగా ఎపుగా పెద్దగా పెరిగే మొక్కల ద్వారానే ఏర్పాటు చేయాలని సూచించారు. హరిత హారం కింద చేపట్టిన మొక్కలన్నీ కచ్చితంగా బతికి తీరాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గి, ఎండలు కాస్త ముదిరే పరిస్థితి వస్తున్నందున, మొక్కలకునీటిని పెట్టడం, పాదులు తీయడం, ఏవైనా మొక్కలు మనలేకపోతే, అక్కడ కొత్త మొక్కలను నాటడం, ప్రతి మొక్కను బతికించడమే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. అధికారులు ఆయా చోట్ల ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని సమస్యులంటే పరిష్కరించుకోవాలని, లక్ష్యాలకనుగుణంగా పని చేసి తీరాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.