సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నది. చేస్తున్నది ఎంతో ఉంది. చెప్పుకోవాల్సింది చాలా ఉంది. అదంతా ప్రజలకు వివరిద్దాం. ఇంకా సమస్యలేమైనా ఉంటే వాటిని సమన్వయంగా ఎదుర్కొందాం. వాటిని పరిష్కరించే బాధ్యత నాది. ప్రభుత్వం చేస్తున్నది ప్రజలకు వివరించే బాధ్యత మీది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాప్రతినిధులకు ఉద్బోధించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలోని గ్రామాల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆయా గ్రామాల్లోని ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలపై రెండు రోజులు సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని ధర్మపురం, పడమటి తండా (డి), సిత్యా తండా, లకావత్ తండా, లక్ష్మణ్ తండా, కామా రెడ్డి గూడెం, మన్ పహాడ్, గొల్లపల్లి, చౌడూరు, పడమటి తండా (పెద్ద తండా), అప్పిరెడ్డి పల్లె, కడవెండి, చిప్ప రాళ్ల బండ తండా, పొట్టిగుట్ట తండా, సీతారాం పురం, దర్మగడ్డ తండాల గ్రామాలపై ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ముఖ్య నాయ కులతో పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావానికి ముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులను బేరీజు వేయండి. ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఎన్ని రకాల పథకాలు అమలు అవుతున్నాయో పరిశీలించండి. వాటన్నింటినీ ప్రజల్లోకి జోరుగా తీసుకెళ్ళండి. అని ప్రజాప్రతినిధులకు మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చాక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, లంబాడీల ఆత్మగౌరవాన్ని పెంపొందించాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల పై అసెంబ్లీ తీర్మానాలు చేసినం. పార్లమెంట్ తీర్మానిస్తే తప్ప, బిల్లు పాస్ కాని పరిస్థితి. ఆ పని కేంద్ర ప్రభుత్వం చేయాల్సి వుందని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో అనేక సిసి రోడ్లు వేసినం. మురుగునీటి కాలువలు నిర్మిస్తున్నాం. ప్రతి గ్రామగ్రామాల నర్సరీలు, తడి, పొడి చెత్తలను వేరు చేసే డంపు యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నాం. ఇంకా రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా లక్ష కల్లాలు, రైతులను సంఘటిత పరిచేవిధంగా 2,601 రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇవేగాక మహిళలకు స్త్రీ నిధి ద్వారా అతి తక్కువ వడ్డీరే రుణాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు. పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పారిశుద్ధ్యం నిరంతరం కొనసాగుతోంది. ఈ కారణంగానే కరోనాని సైతం ఎదుర్కొన్నాం. సీజనల్ వ్యాధులు అదుపులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఇక ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఇక రైతాంగం కోసం, కుల వృత్తులను ఆదుకోవడం కోసం చేపట్టిన అనేక పథకాలు ఉన్నాయని, ఆరోగ్య లక్ష్మీ, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్,కేసీఆర్ కిట్లు… ఇలా 600లకు పైగా పథకాలు అమలవుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు.
ఇక లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చినం. అనేక ఉద్యోగాలు రకరకాల సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోతున్నాయి. అయినా వాటిపై న్యాయపోరాటం చేస్తున్నాం. త్వరలోనే అవన్నీ పూర్తి చేస్తాం. అలాగే, కొత్తగా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. తాజాగా ఉపాధి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు బాగా పెంచినం, ఇంకా పెంచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో తేడాలను కూడా ప్రజలకు వివరించాలని మంత్రి తెలిపారు. ఒకవైపు రాష్ట్రంలో రైతులకు అనుకూల, ఉపయోగ, శ్రేయోదాయక పథకాలు అమలవుతుంటే, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ విధానాలు తెచ్చిందన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించేందుకు పూనుకన్నదని మంత్రి ప్రజాప్రతినిధులకు వివరించారు.వీటన్నింటినీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అలాగే ఇంకా సమస్యలేమైనా వాటిని పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులంతా తమ గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు అందించారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.