యువ‌త బీజేపీ మాయ‌లో పడొద్దు- మంత్రి ఎర్రబెల్లి

48
minster errabelli

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్లగొండ పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో వార్డులు, బూత్ ల వారీగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శనివారం స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, బూత్ లు, వార్డుల వారీగా ఉన్న ఓట్లు, వారి ఇన్ చార్జీలు ఇప్ప‌టి దాకా నిర్వ‌హించిన కార్య‌క‌లాపాల‌పై మంత్రి కూల‌కంశంగా చ‌ర్చించారు. సాధ్య‌మైనంత వ‌రకు ఓట్లు టిఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికే ప‌డే విధంగా ఏమేమీ చేయాలో బూత్, వార్డుల ఇన్ చార్జీల‌కు మంత్రి దిశా నిర్దేశం చేశారు. అలాగే పార్టీ ఓట్లు చీల‌కుండా చూడాల‌న్నారు.

ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. ఇప్ప‌టి దాకా ప్ర‌భుత్వం 1,32,899 ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వ రంగంలోనూ ఉపాధి, ఉద్యోగావ‌కాశాల‌ను పెంపొందించిన‌ట్లు మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వ‌ప‌రంగా మొత్తం జనాభాలో 1శాతం మాత్ర‌మే ఉద్యోగాలు ఇవ్వ‌డానికి వీలుంటుంద‌న్నారు. మ‌రో 50వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు, ఈ ఎన్నిక‌ల త‌ర్వాత నోటిఫికేష‌న్లు వ‌స్తాయ‌న్నారు. ఇక బీజేపీ ప్ర‌జ‌ల‌ను బాగా మ‌భ్య పెడుతూ, అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న‌ద‌న్నారు. ఆ మాయ‌లో యువ‌త పడొద్ద‌న్నారు. బీజేపీ దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. రైతు వ్య‌తిరేక చట్టాల‌ను తెచ్చారు? రైతులంతా వ్య‌తిరేకిస్తున్నారా? లేదా? అని ప్ర‌శ్నించారు.

ఓట‌ర్లు, ప్ర‌జ‌లు భావోద్వేగాల‌కు లోనుకావ‌ద్ద‌న్నారు. ఇక మిగ‌తా పార్టీల‌తో అయ్యేదేమీ లేద‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖ‌త‌మైంద‌ని, టిడిపి లేనేలేద‌ని చెప్పారు. ఈ ద‌శ‌లో మ‌న ఇంటి పార్టీ, మ‌న ఉద్య‌మ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ‌ను ఉద్య‌మ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమాల‌తో బంగారు మ‌యం చేస్తున్న కెసిఆర్ కంటే మెరుగైన సీఎం దేశంలోనే లేర‌న్నారు. కెసిఆర్ చేప‌ట్టిన ప‌థ‌కాల‌తోపాటు, నిల‌బెట్టిన అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కంటే కూడా మెరుగైన అభ్య‌ర్థి లేర‌న్నారు. అందుకే ఛాలెంజ్ గా తీసుకుని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్దికే ఓటు వేయాల‌ని, ఆయ‌న‌ను బంప‌ర్ మెజార్టీతో గెలిపించాల‌ని మంత్రి కోరారు. మరికొద్ది రోజులు కష్ట పడితే మంచి మెజారిటీ వస్తుందని మంత్రి పార్టీ నేతలకు చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వార్డుల ఇన్ చార్జీలు త‌దిత‌రులు పాల్గొన్నారు.