తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధికి చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన కేంద్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక యోజన నవంబర్ ప్రత్యేక సంచికను హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిక మాస పత్రిక తెలంగాణ లాగా, కేంద్రంలో ప్రభుత్వ అధికారిక పత్రిక యోజన.. అభివృద్ధి సంక్షేమ పత్రికగా దేశంలో యోజన పత్రికకు మంచి పేరు ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ యోజన పత్రిక వెలువడుతున్నది. ఐఎఎస్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా ఈ యోజన పత్రిక మంచి సమాచార వాహిక అని మంత్రి తెలిపారు.
యోజన పత్రికలో ఈ నవంబర్ సంచికను మన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసమే కేటాయించారు. మొత్తం 72 పేజీల్లోనూ మన తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గురించే రాశారు. తెలంగాణలోని ఆదర్శ గ్రామాలు, వాటి అభివృద్ధి పైనా ప్రత్యేక వ్యాసాలు రాశారు. మన రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాల మీద ప్రత్యేకంగా రాశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాలను ఆదర్శంగా మార్చారు. గంగదేవిపల్లె, ఇబ్రహీంపూర్, అంకాపూర్ లాంటి అనేక ఆదర్శ గ్రామాల వివరాలు ప్రత్యేకంగా ఇచ్చారు అని అన్నారు.
ఇంకా… పల్లె ప్రగతి, గ్రామ సభలు, గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు, పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఇంటింటికీ నల్లాల ద్వారా అందిస్తున్న మంచినీరు, డింపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, హరిత హారం- గ్రామాలకు హరిత నిధి, ఉపాధి హామీ, తండాలు, ఆదివాసీ గాడాల్లో పెసా చట్టం ప్రకారం చేస్తున్న అభివృద్ధి, గ్రామాల స్థాయిలో ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, గ్రామ పంచాయతీల డిజిటలైజేషన్, పారదర్శకమైన ఆడిటింగ్ వంటి అనేక అంశాల మీద ప్రత్యేకంగా వ్యాసాలు రాశారు. యోజన మాస పత్రిక నిర్వాహకులు, సంపాదకవర్గం, ప్రత్యేకంగా వ్యాసాలు రాసిన అధికారులను అభినందిస్తున్నాను మంత్రి పేర్కొన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన మన రాష్ట్ర ఖ్యాతిని, సీఎం కేసీఆర్ కృషిని దశ దిశలా వ్యాప్తి చేయాలి. తెలంగాణలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి అమలవుతున్న ఈ పథకాలను దేశ స్థాయిలోనూ అందరికీ తెలిసేలా మరింత ప్రచారం ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో యోజన పత్రిక సీనియర్ ఎడిటర్ శ్రీమతి కృష్ణ వందన. పి., ఎడిటర్ సిరాజుద్దీన్ మహ్మద్, I & PR డిప్యూటీ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.