వ్యాక్సిన్ల‌పై త‌ప్పుడు ప్రచారాలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు..

140
minister errabelli
- Advertisement -

ఈరోజు వ‌రంగ‌ల్ లోని ఎంజిఎం హాస్పిట‌ల్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభించారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. నిర్ణీత వైద్యులు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కి మొద‌టి విడ‌త‌గా, డాక్ట‌ర్ల చేత మంత్రి ద‌గ్గ‌రుండి వ్యాక్సినేషన్ చేయించారు. ఎంజిఎంలో మంత్రి ఎర్ర‌బెల్లితోపాటు, వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర్ మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, ఎంజిఎం సూప‌రింటెండెంట్, ఇత‌ర డాక్ట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోడీ, సీఎం కెసిఆర్ ల కృషి వ‌ల్ల ఈ రోజు దేశ‌, మ‌న రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు కోవిడ్ నివార‌ణ‌కు వ్యాక్సిన్ కోసం 9 నెల‌లుగా ఎదురు చూస్తున్నారు.ఎంతో ముందుగానే మ‌న దేశంలో వ్యాక్సిన్ క‌నుక్కోవ‌డం, అవి అందుబాటులోకి రావ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం. ఈ రోజు నుంచి దేశంతో స‌హా, మ‌న రాష్ట్రంలోనూ కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో ఈ రోజు వ్యాక్సినేష‌న్ ని ప్రారంభించాం. ఇది అదృష్టంగా భావిస్తున్నాను.

వ‌రంగ‌ల్ పూర్వ జిల్లాలో 21 కేంద్రాల్లో క‌రోనా నివార‌ణ వ్యాక్సిన్ ఇవ్వ‌డాన్ని ప్రారంభించాం. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో.. 46,579 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.వీరిలో 45,768 మంది కోలుకున్నారు. ఈ రోజు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా లో 6, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 6, జ‌న‌గామ జిల్లాలో 2, మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ‌4, ములుగులో 2, భూపాల‌ప‌ల్లి జిల్లాలో 3 కేంద్రాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ఉచితంగా టీకాలు వేస్తున్నారు. ఉమ్మ‌డి జిల్లాలో ఈ రోజు 126 మందికి వ్యాక్సిన్ వేస్తున్నాం. ఒక్కో సెంట‌ర్ లో 30 మంది చొప్పున వేస్తున్నామన్నారు.ఆశా వ‌ర్క‌ర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి మొద‌ట వ్యాక్సిన్లు వేయాల‌ని నిర్ణ‌యించాం. 31,299 మందికి అర్బ‌న్ జిల్లాలో వేయాల‌ని ప్రణాళిక సిద్ధం చేశాం. ఉమ్మ‌డి జిల్లాలో 92 ప్రాంతాల్లో వ్యాక్సిన్ ని స్టోరేజీ చేశాం. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు వ్యాక్సినేష‌న్ కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

వ్యాక్సిన్లు తీసుకున్న వారిని ప‌ర్య‌వేక్షించేందుకు 18 సెంట‌ర్లు ఏర్పాటు చేశాం. అక్క‌డ వైద్య సిబ్బంది, ఇత‌ర అధికారులు మొద‌టి విడ‌త‌లో వైద్య సిబ్బందికి, రెండో విడ‌త‌లో ఫ్రంట్ లైన్ సిబ్బంది, వారియ‌ర్స్ కి, ఆ త‌ర్వాత 50 ఏళ్ళు దాటిన‌ వృద్ధులు, ఆత‌ర్వాత 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ లోపు వాళ్ళ‌కు వ్యాక్సిన్లు వేస్తున్నాం. దీర్ఘ కాలిక వ్యాధులున్న వాళ్ళ‌కు కూడా టీకాలు వేస్తం. 18 ఏళ్ళు నిండిన వాళ్ళ‌కు మాత్ర‌మే వ్యాక్సిన్లు వేస్తారు. మొద‌టి, రెండో డోసులు ప‌డితేనే, వ్యాక్సిన్ పూర్తిగా వేసుకున్న‌ట్లు.. టీకాలు వేసుకున్న‌ప్ప‌టికీ మాస్కులు ధ‌రించాలి, సామాజిక భౌతిక దూరం పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉండాలి.

వ్యాక్సిన్ల‌పై త‌ప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళ‌పై క‌ఠిన చ‌ర్య‌లుంటాయి. అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు, జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌ర్వాతే, వ్యాక్సిన్లు వేయ‌డాన్ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్రారంభించాయి. వైద్యులు, సిబ్బంది, ఆశా వ‌ర్క‌ర్లు, పారిశుద్ధ్య సిబ్బంది క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా క‌రోనాపై గ‌ట్టి పోరాటం చేశారు. కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనా బాధితులను ప‌ట్టించుకోలేని పరిస్థితుల్లో వీరంతా అద్భుతంగా ప‌ని చేశారు. క‌రోనాతో చ‌నిపోయిన వారిని ఎవ‌రూప‌ట్టించుకోని స‌మ‌యాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు, మున్సిపాలిటీ, గ్రామాల పంచాయ‌తీలు, ఇత‌ర సిబ్బంది ప‌ట్టించుకుని, త‌మ ప్రాణాల‌ను సైతం ఫ‌ణంగా పెట్టి ప‌ని చేశారు. వాళ్ళంద‌రినీ అభినందిస్తున్నాను. ఇక ఈ వ్యాక్సిన్ల‌ను ప్ర‌తి ఒక్క‌రికీ అందేలా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలి.ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో అంద‌రికీ వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తాను అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -