MGMలో ఎలుకల దాడి ఘటన దురదృష్టకరం- మంత్రి

76
- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ను సందర్శించి, పరిశీలించారు. హాస్పిటల్ లో ముందుగా ఎలుకలు దాడి చేసిన వార్డును పరిశీలించి, ఆ పేషంట్ ను పరామర్శించారు మంత్రి. ఆ వ్యక్తి బంధువులతో మాట్లాడిన మంత్రి, ఘటనకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీశారు. అనంతరం ఎంజీఎం హాస్పిటల్ లోని పలు విభాగాలను సందర్శించి అక్కడి పరిస్థితులను మంత్రి పరిశీలించారు. పారిశుద్ధ్యం నిర్వహణ, వార్డుల నిర్వహణ, సిబ్బంది, పేషంట్ల కు అందుతున్న వైద్యం వంటి అనేక అంశాలపై ఆరా తీసిన మంత్రి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆర్ఎంఓలు, వివిధ విభాగాల అధిపతులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడి, హాస్పిటల్ నిర్వహణపై సమీక్షించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..ఎంజీఎంలో నిన్నటి ఘటన దురదృష్టకరం. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సహజంగానే అనేక పేషంట్ కేర్, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. పేషంట్ల పట్ల నిర్లక్ష్యం కావాలని ఉండదు. అయినా ఇలాంటి ఘటన విచారకరం..దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. అందుకు ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించింది. ఈ ఘనటపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే విచారణ చేసి, బాధ్యులుగా భావిస్తున్న సూపరింటెండెంట్ ను బదిలీ, ఇద్దరు డాక్టర్ల ను సస్పెండ్ చేశారు.

పారిశుద్ధ్య ఏజెన్సీల పైనా చర్యలు..
ఇంకా ఇక్కడ పేషంట్ కేర్ ను, పారిశుద్ధ్య పనులను చూస్తున్న ఏజెన్సీ పై కూడా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.ఎంజీఎం లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఇకపై గట్టి నిఘా పెట్టాలని, అత్యంత జాగ్రత్తగా, పేషంట్ల సేవలు కేంద్రంగా పని చేయాలని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కొత్త సూపరింటెండెంట్ ని ఆదేశించాము. ప్రజలు, ప్రత్యేకించి పేషంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం.. ధైర్యంగా, నమ్మకంగా ఎంజీఎం కు రావచ్చు అన్నారు.

రాష్ట్రం వచ్చాకే ఎంజీఎం కు మహర్దశ..
నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఎంజీఎం తెలంగాణ వచ్చినంకనే బాగైంది.సీఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఎంజీఎం కి బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించారు. సిఎం కెసిఆర్ బంగారు తెలంగాణ‌లో భాగంగా ఆరోగ్య తెలంగాణ సాధించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా సిఎం కెసిఆర్ ఆశీస్సుల‌తో హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్ మెడిక‌ల్ హ‌బ్ గా త‌యారైంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌హా, ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డా సూప‌ర్ మ‌ల్టీ స్పెషాలిటీ వైద్యం… వ‌రంగ‌ల్ లో అందుబాటులోకి తెచ్చామన్నారు.

కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఎంజీఎం..
క‌రోనా క‌ష్ట కాలంలోనే దాదాపు వెయ్యి కోట్లు వైద్య రంగంపై ఖ‌ర్చు చేసి మౌలిక స‌దుపాయాలు క‌ల్పించినాం.వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్పిట‌ల్ లో 10 కె.ఎల్‌., 13 కె.ఎల్‌. 2 పిఎస్ఎ ఆక్సీజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాం. 1292 బెడ్ల‌ను ఆక్సీజ‌న్ బెడ్లుగా మార్చినాం. అలాగే 227 ఐ.సి.యు బెడ్ల‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే మొత్తం 2 కోట్ల 28 లక్షల 50 వేల రూపాయలతో ప‌లు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు జ‌రుపుకున్నాం. రూ. 40 లక్షలతో 42 పడకల చిన్న పిల్లల కోవిడ్ ప్రత్యేక సంరక్షణ విభాగం ప్రారంభం (ఇందులో 30 పడకల జనరల్ వార్డు, 4 పడకల HDU వార్డు, 8 పడకల ICU వార్డు) ను ప్రారంభించుకున్నం.. కాకతీయ మెడికల్ కాలేజీలో సీట్లను పెంచుకున్నాం. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఉన్న నాటి సెంట్ర‌ల్ జైలును న‌గ‌ర శివారులోని మామునూరుకు త‌ర‌లించి, ఆధునిక సౌక‌ర్యాల‌తో ఓపెన్ ఏయిర్ జైలు నిర్మాణం చేప‌ట్టుట‌కు 101 ఎక‌రాల భూమిని కేటాయించినం. సెంట్ర‌ల్ జైలు స్థ‌లంలో 11 వంద‌ల కోట్ల‌తో అత్యాధునిక మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణం చేప‌ట్టాం. పి.ఎం.ఎస్‌.ఎస్‌.వై. సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప్రారంభ‌మైంది. అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌తో ఈ హాస్పిట‌ల్ ప్ర‌జ‌ల‌కు మంచి వైద్యం అందించ‌నుందన్నారు మంత్రి ఎర్రబెల్లి.

ప్ర‌జావ‌స‌రాల‌ను బ‌ట్టి మ‌రిన్ని వైద్య స‌దుపాయాలు క‌ల్పిస్తాం. సిఎం కెసిఆర్ ఆధ్వ‌ర్యంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న‌ది. సీఎం కెసిఆర్ నేతృత్వంలోనే ప్రభుత్వ దవాఖానల మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. 50 శాతం ప్రసవాలు ఇవ్వాళ సర్కారు దవాఖానలలో జరుగుతున్నాయి. మన దేశంలో ప్రపంచస్థాయి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బయటకు వెళ్లి లక్షలు ఖర్చు చేసుకోవద్దు. నిస్వార్థంగా నిర్వహించే ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నారు. కాగా,ఎంజీఎం హాస్పిటల్ కి సాత్విక్ రూరల్ అండ్ యూత్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా మూడు కోట్ల విలువైన పరికరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఉచితంగా ఇవ్వడం జరిగింది.

- Advertisement -