ఫిబ్రవరి నెల నుంచి ట్రాయల్ రన్ నిర్వహించి, ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతి రోజూ, ప్రతి ఇంటికి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన మంచినీటిని సరఫరా చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మరో రెండు నెలల్లోనే, నగరంలో రోడ్లు, మురుగునీటి కాలువలు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను అభివృద్ధి పరచి మొత్తం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని ఆయన వెల్లడించారు. నగరంలోని న్యూ శాయంపేటలో రూ.6.79 కోట్ల వ్యయంతో, 4300 పోల్స్ తో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టంను శుక్రవారం సాయంత్రం, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి, మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఒక్క మిషన్ భగీరథ ద్వారానే రూ.1200 కోట్లతో ఒక్క వరంగల్ నగరంలోనే మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.196 కోట్లు మాత్రమే ఇస్తున్నది అని చెప్పారు. ఇక ప్రతి ఏటా వరంగల్ కార్పొరేషన్ కి రూ.300 కోట్లు ప్రభుత్వం ఇస్తున్నారన్నారు. మొన్న కురిసిన వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతులకు రూ.25 కోట్లు తక్షణ సాయంగా అందించామన్నారు.
సీఎం కేసిఆర్ హామీల కింద, రకరకాలుగా పలు అభివృద్ధి పథకాలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి అన్ని విధాలుగా నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి వివరించారు. విస్తరిస్తున్న నగరానికి సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించడం, నగరాన్ని ప్రణాళిక బద్దంగా నిర్మించడం, భవిష్యత్తులో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.