రాష్ట్ర రైతాంగమంతా ఏకం కావాలి. అవసరమైతే దేశ రైతాంగాన్ని కలుపుకుని ఉద్యమించాలి. కేంద్రం రాష్ట్రంపై వివక్షను మానుకునే వరకు, ప్రతి గింజా కొనుగోలు చేసే వరకు కేంద్రం మెడలు వంచి, ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పండించిన ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అందుకు నిరసనగా చేపట్టిన ఆందోళనలను కేంద్రం దిగి వచ్చే వరకు ఆపేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల పిలుపు మేరకు చేపట్టిన ఆందోళనలను అప్పటి వరకు కొనసాగించాలని మంత్రి ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేపట్టాలని, ఈ ధర్నాలలో రైతులంతా పాల్గొనాలి, పార్లమెంట్ లో ఎంపీలు నిలదీసినా కేంద్రం దిగి రావట్లేదు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మంత్రులు రా రైస్ మాత్రమే కోంటం అంటున్నారు, తెలంగాణలో రా రైస్ రాదు, కావాలనే బీజేపి తెలంగాణను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కాలేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో వరి పంట సాగు విపరీతంగా పెరిగింది. వరి తప్ప వేరే పంట వేస్తే పండే పరిస్థితి లేదు. గోదాములన్నీ నిండి ఉన్నాయని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతులను వరి వేయోద్దంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కొనే భాద్యత మాది రైతులు పంట వేయండి అన్నారు. ఇప్పుడు కేంద్రం చేతులెత్తేస్తున్నది. ఆ బీజేపీ నాయకులు మాట మారుస్తున్నరు. పిచ్చి మాటలు చెప్పి రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. కేంద్రం దిగి వచ్చి యాసంగి వరి ధాన్యం కోనే వరకు వదిలి పెట్టేది లేదు. దేశంలో బిజెపి తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించిన మొదటి పార్టీ టీఆర్ఎస్. ఆ కోపంతోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అణగతోక్కాలనే బీజేపి ప్రయత్నం చేస్తున్నదని మంత్రి అరోపించారు. దేశ వ్యాప్తంగా జరిగిన రైతుల ఆందోళన కారణంగా, 700 మంది రైతులు మరణించాకా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారన్నారు.
రైతాంగం అంతా ఏకం కావాలి. కేంద్రం ప్రతీ గింజ కోంటాం అనే వరకు పోరాటం కోనసాగించాలి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీ ఇంటి పై నా నల్ల జెండా ఎగరవేయాలి, గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను శవయాత్రలు చేసి దగ్ధంచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు తెలంగాణ ను నూకలు తిని బతకమంటున్నరు, వరి ధాన్యం కొనకపోతే కేంద్ర ప్రభుత్వానికే నూకలు తినిపిస్తం. తెలంగాణ తెగువ ఏంటో చూపిస్తమని మంత్రి అన్నారు.
తెలంగాణపై కేంద్రం కక్ష సాదింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకానికి 25వేల కోట్ల కోత విధించారు. 15లక్షల పనిదినాలను 10లక్షల పనిదినాలకు కుదించారు. ఎస్సీ వర్గీకరణ లేదు. కోచ్ ఫ్యాక్టరీ లేదు. బయ్యారం ఉక్కు పక్కన పెట్టారు. విభజన హామీలను వదిలేశారు. అడుగడుగునా చేస్తున్న ఈ వివక్షను తిప్పికొట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రజలకు పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడిన వారిలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, తదితర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.