ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా విస్తరణ ఆగడంలేదు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైసు సీఎం కెసిఆర్ గారు, అటు అధికారులు, డాక్టర్లు, పోలీసులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసి కట్టుగా ప్రయత్నిస్తున్నా…ఫలితానికి మించి కరోనా విస్తరిస్తున్నది. అయినా సరే, ఆ వైరస్ ని అరి కట్టడానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ, సమన్వయంతో విస్తరించకుండా జాగ్రత్త పడదాం. ప్రజల్లో మరింత అవగాహన పెంచి అప్రమత్తం చేద్దాం. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు అభివృద్ధి పనులను కూడా ఆపకుండా వేగిరం చేద్దామని మంత్రి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పరిస్థితులు, అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, మండల పార్టీ నేతలతో కలిసి పాలకుర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తికి సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికంటే ముందే మేలుకొంది. అనేక చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ విధించింది. ఆర్థిక భారాలను సైతం ఓర్చి, అభివృద్ధి పనులను ఆపలేదు. పైగా, రైతాంగానికి కూడా రైతు బంధు సహా, కల్లాలు, రైతు వేదికలు, రూ.25వేల రుణాల మాఫీ వంటి అనేక చర్యలు చేపట్టింది. కరోనా బాధితుల కోసం పరీక్షలు, చికిత్సలు, పౌష్టికాహారం అందిస్తున్నది. ఇంత చేసినా, విస్తృతి ఇంకా పెరుగుతూనే ఉంది. నగరాలకే పరిమితమైన వైరస్ ఇప్పుడు పట్టణాలు దాటి పల్లెలకు పాకింది. ఇప్పుడిక మనమంతా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది అని చెప్పారు.
కరోనా వైరస్ మరింతగా విస్తరించకుండా ఇగింత సమన్వయంతో మెలగాలి. గ్రామ స్థాయిల్లో కమిటీలు వేద్దాం. సర్పంచ్, ఎంపీటీసీ, రైతు సమన్వయ సమితి గ్రామ సమన్వయకర్త, గ్రామాల పార్టీల ప్రతినిధులు, యూత్ తో కలిపి కమిటీలు వేయాలి. ఆ కమిటీలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో కరోనా పరిస్థితుల మీద నిఘా పెట్టి ఆరా తీస్తూ, వైరస్ విస్తరణను కట్టడి చేయాలి. ప్రజలకు భరోసానివ్వాలి. గ్రామాల్లో టాం టాం వేస్తూ, అవగాహన పెంచి, ప్రజలకు భరోసానివ్వాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. అలాగే మండల స్థాయిలోనూ ఎంపీపీ, ఎంపీడీఓ, ఎమ్మార్వో, సిఐ, ఎస్ఐ, తదితరులతో కలిపి మండల పరిస్థితులన సమీక్షించాలన్నారు.
ఇక నుంచి తాను స్వయంగా మండల, గ్రామాల ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ మేరకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, ఇతర నేతల ఫోన్ నెంబర్లతో కూడిన ఒక జాబితాను సిద్ధం చేశారు.వారందరితోనూ ప్రతి రోజూ మాట్లాడి, పరిస్థితులను సమన్వయం చేసుకుంటామని మంత్రి వివరించారు.
అన్ని రకాల ఫంక్షన్లను రద్దు చేయడమే మంచిదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కనీసం 50 మందికి మించకుండా ఫంక్షన్లు చేయాలని చెప్పినప్పటికీ, అంతకుమించే పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే మాస్కులు ధరించని వాళ్ళకు భారీగా జరిమానా విధించాలని మంత్రి సూచించారు. ఇందుకు ఎవరినీ మినహాయించవద్దని మంత్రి తెలిపారు.నియోజకవర్గానికి త్వరలో 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు పంపిణీ చేస్తామన్నారు.
జూన్ నెలలో పాలకుర్తి నియోజకవర్గంలో భారీగా మాస్కులను పంపిణీ చేశామని. అదే తరహాలో త్వరలోనే 4 లక్షల మాస్కులను పంపిణీ చేయనున్నామని మంత్రి తెలిపారు. వీటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని మంత్రి ప్రజాప్రతినిధులకు సూచించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నడుస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో త్వరలోనే పాలకుర్తి నియోజకవర్గానికి రెండు అంబులెన్సు వాహనాలను ఇవ్వనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. ఒకటి కోవిడ్ టెస్టు తోపాటు, ఆక్సీజన్ తో కూడిన అత్యాధునిక అంబులెన్స్ , మరోటి మరోటి కరోనా బాధితులను తరలించడానికి వీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో ఒకటి తొర్రూరు, మరోకటి పాలకుర్తి కేంద్రంగా ఉంటాయన్నారు. వీటిని ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఇక నుంచి హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని, కరోనా కట్టడికి ప్రయత్నించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఎవరి స్థాయిలో వారు ఇళ్ళల్లో కుండకుండా, జాగ్రత్తగా ఉంటూనే ప్రజల్లో తిరుగుతూ, వారికి ప్రభుత్వం ఉందన్నభరోసానివ్వాలని చెప్పారు.
ఎవరైనా కరోనా బాధితులు ఉంటే వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే, వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిచెప్పి, భరోసానివ్వాలన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా కరోనాతో మరణిస్తే, అలాంటి వాళ్ళకి అంతిమ క్రియలకు ఆటంకాలు రాకుండా చూడాలన్నారు. కరోనాతో మరణించి వాళ్ళ ద్వారా ఇతరులకు కరోనా సోకదన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలిపాలన్నారు. మానవతతో మెలగాలని, ఇలాంటి కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.ఈ సమీక్షలో పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వర్దన్నపేట ఎసీపీ, సిఐలు, ఎస్ ఐలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.