గ్రామాల్లో ప్ర‌తి ఇల్లూ… ఆన్ లైన్ కావాలి

119
errabelli

వ్య‌వ‌సాయ దారుల‌కు ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల త‌ర‌హాలో గ్రామాల్లో ఇండ్ల‌కు కూడా మెరూన్ పాసు పుస్త‌కాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్ణ‌యించినందున ఆయా వివ‌రాల‌తో కూడిన రికార్డును ప‌క‌డ్బందీగా త‌యారు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌క రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటివ స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. సిఎం కెసిఆర్ నిర్ణ‌యం మేర‌కు గ్రామాల్లోని ప్ర‌తి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాల‌ని మంత్రి సూచించారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, ఇత‌ర అధికారులతో మంత్రి హైద‌రాబాద్ లోని మంత్రులు నివాసంలో స‌మావేశ‌మై ఆయా అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, కొత్త రెవిన్యూ చ‌ట్టంలో భాగంగా, వ్య‌వ‌సాయ భూముల‌కు మాదిరిగానే, గ్రామాల్లోని ఇండ్లు, ఇత‌ర అన్ని ర‌కాల నిర్మాణాల‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పిస్తూ, ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల ఇవ్వాల‌ని సిఎం కెసిఆర్ నిర్ణ‌యించార‌న్నారు. భూముల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతోపాటు, ఆయా భూ, ఇండ్ల య‌జ‌మానుల‌కు భ‌రోసానివ్వాల‌న్న‌దే సీఎం ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందుక‌నుగుణంగా గ్రామాల్లోని ప్ర‌తి ఇల్లు, ఇత‌ర నిర్మాణాల వివ‌రాలు, వ్య‌వ‌సాయ క్షేత్రాల్లోని ఇండ్లు, వ‌గైరాల‌న్నీ ప్ర‌తి అంగుళం రికార్డు చేయాల‌ని అందుకు త‌గ్గ‌ట్లుగా, కింది స్థాయి వ‌ర‌కు ఆదేశాలు వెళ్ళాల‌ని చెప్పారు.

ఎలాంటి లోపాలు లేకుండా రికార్డు ప్ర‌క్రియ‌ను ఓ ప్ర‌ణాళికాబ‌ద్ధంగా, వేగంగా పూర్తి చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే ప్ర‌జ‌ల్లో అనుమానాలు, అపోహ‌లుంటే తొల‌గించాల‌ని చెప్పారు. కేవ‌లం భ‌ద్ర‌త క‌ల్పించ‌డ‌మే త‌ప్ప‌, ఇందులో హిడెన్ ఎజెండా ఏదీ లేద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థం చేయాల‌న్నారు. ద‌ళారులు, ఇత‌రులెవ‌రికీ డ‌బ్బులు కూడా ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని, ఆన్ లైన్ ప్ర‌క్రియ పూర్తి ఉచితంగా జ‌రుగుతుంద‌న్న విష‌యంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం పెంచాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి సూచించారు.