ఆదాయం పెంచాలి–పేదలకు పంచాలి: ఎర్రబెల్లి

506
errabelli dayakar rao
- Advertisement -

బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్లూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌లకు జిల్లా ప్రజాపరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌లకు, జెడ్పీటీసీ సభ్యులకు, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులకు, మండల ప్రజాపరిషత్‌ ఉపాధ్యక్షులకు,ఎంపీటీసీ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు.

‘కొత్తగా పదవీ బాధ్యతలు చేపడుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, హరిత హారం వంటి బృహత్తర ప్రాజెక్టులను చేపట్టారు. ఆదాయం పెంచాలి–పేదలకు పంచాలి అనే నినాదంతో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో… సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మీపై కీలక బాధ్యత ఉంది. మెరుగైన పరిపాలన అందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. గ్రామపంచాయతీలు, మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్‌ల పునర్విభజనతోపాటు స్థానిక సంస్థలకు ఎన్నో అధికారాలను, బాధ్యతలను అప్పగించారు.

పరిపాలనలో జవాబుదారీతనం పెంచేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించారు. పల్లెల వికాసంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అనే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మీరు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ… అందరికీ శుభాకాంక్షలు’ అని మంత్రి దయాకర్ రావు లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -