సుర‌వ‌రంను ఆద‌ర్శంగా తీసుకోవాలి- మంత్రి ఎర్రబెల్లి

269
minister errabelli
- Advertisement -

ఆదివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి 125వ జ‌యంతి ఉత్స‌వాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుడు సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి 125వ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్, తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం, మెఫీ (మీడియా ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్ ఇండియా),తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్, సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి సాహిత్య, వైజ‌యంతి ట్ర‌స్టు లు క‌లిసి… తెలుగు జ‌ర్న‌లిజంలో నాటి నుండే నేటి వ‌ర‌కు వ‌స్తున్న మార్పుల‌పై స‌ద‌స్సు నిర్వ‌హించ‌డం గొప్ప విష‌యం అన్నారు.

సురవరం ప్రతాపరెడ్డి అంటే తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం. పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, ప్రేరకుడు, క్రియాశీల ఉద్యమకారుడని మంత్రి అన్నారు. తెలంగాణలో కవులే లేరనే నిందను సవాలుగా తీసుకొని 354 మంది కవులతో కూడిన “గోల్కొండ కవుల సంచిక” గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన మ‌హానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి. 1926లో గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, 1951లో ప్రజావాణి పత్రికలను స్థాపించాడు. అత‌డు రాసిన గ్రంథాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయ ఉద్యమం అన్నారు మంత్రి ఎర్రబెల్లి.

సురవరంకు “కేంద్ర సాహిత్య అకాడమి” అవార్డు లభించింది. ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యం చేశాడు. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు. జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించాడు. ఇప్పుడు మ‌న వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగు జాతికి ప్ర‌తాప్ రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై అత‌డి విగ్ర‌హాన్ని పెట్టారని మంత్రి గుర్తు చేశారు.

అయితే, నిర్బంధంలోనూ ఆయ‌న ప‌త్రికా విలువ‌లు వ‌ద‌ల లేదు. తాను న‌మ్మిన‌, ప్ర‌జ‌ల‌కు మేలు చేసే రాత‌లే రాసిండు. ఆయ‌న ఇప్ప‌టి జ‌ర్న‌లిస్టుల‌కు ప్రేర‌ణ కావాలె. ప్ర‌తాప్ రెడ్డిని మ‌న‌మంతా ఆద‌ర్శంగా తీసుకోవాలె. ఆయ‌న నెల‌కొల్పిన విలువ‌ల‌ను కాపాడ‌టం నేటి జ‌ర్న‌లిస్టుల విధి, ప‌ర‌మావ‌ధి కావాలె. జ‌ర్న‌లిస్టులంతా విలువ‌ల‌ను కోల్పోకుండా… ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి అనుసంధానంగా… ప‌ని చేయాలి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెస్తూ.. వాటి ప‌రిష్కారానికి కృషి చేయాలి. ఇప్ప‌టి జ‌ర్న‌లిస్టులు ఈ స‌వాల్‌ను స్వీక‌రించి, మంచి పేరు తెచ్చుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మన జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తున్నదన్నారు. వరంగల్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, కార్యదర్శి విరాహత్ అలీ, ప్రెస్ క్లబ్ బాధ్యులు శ్రీధర్ రెడ్డి, వెంకట్, జర్నలిస్టులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా మంత్రి సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణ వర్ధన్ రెడ్డిని మంత్రి సన్మానించారు.

- Advertisement -