సిఎం కెసిఆర్ ఆదేశాలే… అధికారుల‌కు విధి విధానాలు

245
Dayakar Rao Errabelli
- Advertisement -

సిఎం కెసిఆర్ ఆదేశాలే… అధికారుల‌కు విధి విధానాల‌ని, వాటిని తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మొన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో సిఎం కెసిఆర్ స‌మీక్షించి ఆదేశించిన ప‌లు అంశాల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ రఘునంద‌న్ రావుల‌తో క‌లిసి స‌మీక్షించారు. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు, వాటి స్థితిగ‌తుల‌తోపాటు, తాజాగా సీఎం స‌మీక్ష‌లో ఆదేశించిన ఆయా ప‌థ‌కాల‌పై మంత్రి స‌మీక్షించారు. ఆయా ప‌నులు నిర్ణీత గ‌డువులో, అత్యంత వేగంగా, స‌మ‌ర్థ‌వంతంగా జ‌రిగేలా చూడాల‌ని ఆదేశించారు. ఉద్య‌మ స్ఫూర్తితో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ప‌ని చేయాల‌ని సూచించారు.

టౌన్ ప్లానింగ్ త‌ర‌హాలోనే గ్రామ ప్ర‌ణాళిక కూడా ఉండాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్ర‌ణాళిక‌లు సిద్ధం కావాల‌ని, అవి నాలుగేళ్ళ‌కు స‌రిప‌డా సిద్ధం చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. దీంతోపాటు జిల్లా ప్రోగ్రెస్ కార్డు సిద్ధం చేయాల‌ని సూచించారు. త‌ద్వారా గ్రామ పంచాయ‌తీల‌కు ఏడాదికి రూ.9,916 కోట్లు, నాలుగేళ్ళ‌ల్లో రూ.39,594 కోట్లు స‌మ‌కూరుతాయ‌న్నారు. వాటిలో ప‌ది శాతం నిధుల‌ను హ‌రిత హారానికి ఇవ్వాల‌ని, అలాగే విద్యుత్ బిల్లులు, ట్రాక్ట‌ర్ల లోన్లు క్ర‌మం త‌ప్ప‌కుండా క‌ట్టుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న వ‌ర్క్స్, సానిటేష‌న్, గ్రీన్ క‌వ‌ర్, స్ట్రీట్ లైట్ క‌మిటీలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసేలా చూడాల‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా రూ.10,000 కోట్ల నిధులు, ,13,993 మంది అధికారులు, 1,32,973 ప్ర‌జాప్ర‌తినిధులు, 8,20,727 మంది స్టాండింగ్ క‌మిటీల స‌భ్యులున్న త‌రుణంలో, క‌లెక్ట‌ర్ల‌కు విశేష అధికారాలిచ్చిన ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోతే మ‌రెప్పుడూ జ‌ర‌గ‌ద‌ని, ఇందుకునుగుణంగా ప‌ని చేయాల‌ని అధికారుల‌కు మంత్రి స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తి రోజూ గ్రామాల్లో పారిశుద్ధ్య ప‌నులు నిర్వ‌హించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. ఇప్ప‌టికే ప‌ల్లె ప్ర‌గ‌తి, ప్ర‌త్యేక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌తో ప‌ల్లెలు ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌ను ప‌రుచుకున్నాయ‌ని చెప్పారు. అయితే ఇక్క‌డితో ఈ ప‌నులు ఆగిపోకూడ‌ద‌ని, నిత్యం జ‌రుగుతుండాల‌ని చెప్పారు. అప్పుడే గ్రామాలు ప‌రిశుభ్రంగా ఉండి, ఆరోగ్య క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌న్నారు. అలాగే గ్రామాల్లో గుంత‌లు పూడ్చాల‌ని, పాడుబ‌డ్డ బావులు ఉండ‌కూడ‌ద‌ని, వ‌దిలేసిన బోరుబావుల‌ను మూసివేయాల‌ని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయ‌తీల‌కు ట్రాక్ట‌ర్, ట్రాలీ, ట్యాంక‌ర్లు, స్మ‌శాన‌వాటిక‌లు, చెత్త‌ను వేరుచేసే డంపులు వంటి స‌దుపాయాలున్న గ్రామాలు దేశంలో మన రాష్ట్రంలో త‌ప్ప మ‌రెక్క‌డా లేవ‌న్నారు. ఇది సీఎం గారు సాధించిన ఘ‌న‌త అని, దీన్ని కొన‌సాగించాల‌ని ఆదేశించారు.

ఇప్ప‌టికే ఉపాధి హామీలో మ‌న రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. దేశ స‌గ‌టు 26.3శాతం మాత్ర‌మే ఉండ‌గా, మ‌న రాష్ట్రం 75.5శాతం ఫ‌లితాలు సాధిచింద‌న్నారు. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ, గ్రామాల్లో కాలువ‌ల‌ను బాగు చేయ‌డం, కంప చెట్ల‌ను తొల‌గించ‌డం, చెరువు క‌ట్ట‌ల‌పై కంప చెట్ల తొల‌గింపు, న‌ర్స‌రీలు, మొక్క‌ల పెంప‌కం, కాలువ‌ల మ‌ర‌మ్మ‌తులు, చెరువుల పూడిక తీత‌, గ్రామాల్లో అంత‌ర్గ‌త దారులు, వైకుంఠ ధామాలు, డంపు యార్డుల నిర్మాణం, అంగ‌న్ వాడీకేంద్రాలు, మురుగ‌నీటి కాలువ‌లు, చెత్త తొల‌గింపు వంటి అనేకానేక ప‌నులు ఈ నిధులు వాడుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు.

రూ.750 కోట్ల న‌రేగా నిధుల‌తో తెలంగాణ రాష్ట్రంలో ల‌క్ష క‌ల్లాల‌ను నిర్మించాల‌ని, ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యి క‌ల్లాలు నిర్మాణ‌మ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉన్న‌తాధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. 50,60,75 ఫీట్ల‌తో కూడిన రైతుల అవ‌స‌రాల‌ను బ‌ట్టి క‌ల్లాలుంటాయ‌న్నారు. ఎస్సీ, ఎస్టీల‌కు వంద శాతం స‌బ్సీడీతో, ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు 10శాతం వాటా ధ‌నం చెల్లిస్తే, 90శాతం స‌బ్సిడీతో క‌ల్లాలు నిర్మిస్తామ‌న్నారు. ఆర్ అండ్ బీ, నీటి పారుద‌ల, ఇంజ‌నీరింగ్, పంచాయ‌తీరాజ్ వంటి ప‌లు శాఖ‌ల‌కు న‌రేగా నిధులు వ‌ర్తింప చేస్తున్నందున ఆయా విభాగాల ప‌నులు చూడ‌టానికి ఇంజ‌నీర్ల‌ను నియమించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించినందున‌, ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు.

25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హ‌రిత హారాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, డంపు యార్డులు, వైకుంట ధామాల‌కు ప్ర‌హరీ గోడ‌లు కాకుండా, గ్రీన్ వాల్ నిర్మించాల‌ని, చుట్టూ ఎత్తైన చెట్లు పెంచాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు జిల్లా క‌లెక్ట‌ర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు బాధ్య‌త తీసుకోవాల‌ని, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి అధికారులంతా త‌మ భుజ స్కంధాల‌పై ఈ బాధ్య‌త‌లు వేసుకుని నిర్వ‌ర్తించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉన్న‌తాధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -