తెలంగాణ తెచ్చి, అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరూరి రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పారిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం రక్త దానం చేసిన కార్యకర్తలకు మంత్రి పండ్లు, గుడ్లు, పాలు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే మహానుభావుడు అన్నారు. ఆయన తెలంగాణను సాధించారు. తెలంగాణను బంగారు మయం చేశారు. ప్రజలందరి బాగు కోసం పాటు పడుతున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ చూడలేదు. అలాంటి మహా వ్యక్తి పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవాలని అన్నారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ఒక పండుగ చేసిన సీఎం కేసీఆర్ పుట్టిన రోజును ప్రజలంతా, పార్టీ శ్రేణులన్నీ పండుగలా చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మన రాష్ట్ర ప్రదాత మాత్రమే కాదు. మన రాష్ట్ర అభివృద్ధి విధాత. ఆయన వల్లే ఇవ్వాళ తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆయన ముందుచూపు వల్లే మనమంతా సంతోషంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు మన అందరికీ పండుగ రోజు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.