కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. గురువారం పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స కోసం కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. దేశంలో కోవిడ్ సెకెంట్ వేవ్ విపరీతంగా పెరిగిపోతుందని, అందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించి, కరోనా వ్యాప్తి నివారణకు సహాకరించాలని పిలుపునిచ్చారు. కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి అవసరమైన రెమిడిసివీర్ ఇంజక్షన్లు, మందుల సరఫరాతో పాటు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కోవిడ్ బారినపడ్డ బాధితుల కోసం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లో ప్రత్యేకంగా 100 బెడ్స్‌తో ఇసోలేషన్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కోవిడ్ బారిన పడి మిగతా కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఐసోలేషన్ సెంటర్‌లో ఉండాలని మంత్రి సూచించారు. ఐసోలేషన్ సెంటర్‌లో నాణ్యమైన ఆహారంతో పాటు, మందులు, వైద్యుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కోవిడ్ భారిన పడ్డ బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి దయాకర్ రావు సూచించారు.
ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావద్దని, మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆడిషనల్ కలెక్టర్ అమీజ్ అహ్మద్, జిల్లా వైద్యాధికారి మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి రంగా చారి, డి. ఎల్.పి.ఓ. కనకదుర్గ, డి.ఆర్.డి.ఓ. రాం రెడ్డి, ఐ కె.పి.ఏపీడీ నురోద్దీన్,మండల వైద్యాధికారులు, తదితరలు పాల్గొన్నారు.