మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టస్ లో తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రాజెక్టు అధికారుల అసోసియేషన్ 2022 సంవత్సరం క్యాలెండర్, డైరీలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పని దినాలు కేటాయిస్తే ఇప్పటివరకు 13 కోట్ల 38 లక్షల పని దినాలు (97.31 శాతం) కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. మరో రెండు కోట్ల పని దినాలను అనుమతి లభించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు 2374 కోట్ల రూపాయలు కూలీగా చెల్లించినట్లు ఆయన చెప్పారు. గ్రామాలలో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు 1049 కోట్ల రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించడం జరిగిందని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం అధికారులు ఉద్యోగుల కృషి వల్ల ఉపాధి హామీ పథకం అమలులో ఎన్నో సత్ఫలితాలు సాధిస్తూన్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ఏపీఓలు మరింత కృషి చేసి పథకం అమలులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో ఎల్లవేళలా ఉంచాలని ఆయన కోరారు. ఏపీఓ ల ఉద్యోగ సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీఓ ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం మోహన్ రావు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి అసోసియేషన్ బాధ్యులు గురుపాదం, శ్రీనివాసరెడ్డి, బాలయ్య, నారాయణ, జాకబ్, శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.