ఎడ్లబండి నడిపిన మంత్రి ఎర్రబెల్లి..

212
errabelli
- Advertisement -

గురువారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం గవిచర్ల, తీగరాజుపల్లిలో రైతు వేదికలను, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఎద్దుల బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. బతుకమ్మలు, బోనాలు, సంప్రదాయ నృత్యాలు, కళాకారులు ముందు నడువగా, ఓ ఎద్దుల బండి నడుపుతూ రైతు వేదికలను చేరుకున్నారు మంత్రి ఎర్రబెల్లి. రైతు వేదికల వద్ద మంత్రికి పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం రైతు వేదికలను, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2601 క్లస్టర్ లలో రైతు వేదికలను నిర్మించాం. ప్రతి అవాసంలో పల్లె ప్రకృతి వనాలను నిర్మిస్తున్నాం. అవన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. కొన్ని మాత్రమే, ప్రగతిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మొదటి రైతు వేదికను కొదకండ్లలో మన ప్రియతమ సీఎం కెసిఆర్ ప్రారంభించారు. ఇప్పుడు గవిచర్ల, తీగ రాజు పల్లిలో ప్రారంభం చేసుకుంటున్నాం. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయని మంత్రి అన్నారు.

మన ముఖ్యమంత్రి స్వయంగా రైతు కాబట్టే రైతుల మేలు కోరే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రైతులకు రైతు బంధు, రైతు భీమా, రైతు రుణ మాఫీ, సమృద్ధిగా సాగునీరు, 24గంటలు నాణ్యమైన విద్యుత్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నాం. నూతన రెవెన్యూ చట్టం అమలులోకి తెచ్చి రైతులకు మేలు చేశాం. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, సంఘటిత పరచి, రైతులను రాజులను చేయాలని సీఎం కేసిఆర్ సంకల్పించారు. ఇప్పటికే ఆ దిశగా దేశంలో ఎవరూ చేయనన్ని పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

చివరకు కేంద్రం వద్దన్నా వినకుండా రాష్ట్ర రైతుల క్షేమం కోసం వారి పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఇంతగా రైతుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. రైతులకు మాత్రమే కాదు, సబ్బండ కులాలు, వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. పల్లె ప్రకృతి వనాలు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్మించాం. ఈ ప్రకృతి వనాల ద్వారా వాతావరణ సమతౌల్యం ఏర్పడి సకాలంలో కాలం అవుతుంది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుంది. ప్రకృతి వనాల నిర్మాణం పల్లె ప్రగతికి సోపానాలు అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

- Advertisement -