ఇప్పటికైనా బీజేపీ,కాంగ్రెస్ పిచ్చి మాటలు మానుకోండి..

123
minister errabelli
- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి అడుగడుగునా స్పష్టమైన మెజారిటీని ఇచ్చారు. ప్రజల మద్దతు టీఆర్‌ఎస్‌కు ఉంది కాబట్టే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలిచామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆదివారం వరంగల్‌లో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలిచింది. ఇప్పటికైనా బీజేపీ- కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చి మాటలు మానుకోండి. బీజేపీని ప్రజలు నమ్మలేదు కాబట్టే తెలంగాణ కౌన్సిల్‌లో బీజేపీకి స్థానం లేకుండా చేశారు. మీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు. స్వతంత్రులకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మీకు ఇవ్వ లేదంటే ప్రజలలో మీ స్థానాన్ని గమనించండి అని మంత్రి విమర్శించారు. నాతో సహా, మా ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లపై దాడులు చేయించి లబ్ది పొందాలని చూశారు.. అందుకే ప్రజలు మీకు బుద్ది చెప్పారు..కేంద్రం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, మీ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించారని మంత్రి తెలిపారు.

Minister Errabelli Dayakar Rao

ఇప్పటికైనా విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కాంగ్రెస్, టీడీపీ లకు కాలం చెల్లింది. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ ఇంటి పార్టీ టీఆర్‌ఎస్, సీఎం కెసిఆర్ వైపే ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడగొట్టడం ఖాయమన్నారు. మాకు సహకరించిన ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు,పట్టభద్రుల ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి. ప్రభుత్వ ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు..ప్రభుత్వం తప్పకుండా పీఆర్‌సీ ఇస్తుంది. ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. తమకు తమ పార్టీ నేతలు మోసం చేయడం వల్లే ఓడామని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విమర్శలు, ఆరోపణల చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు పరోక్షంగా తీన్మార్ మల్లన్నకు సహకరించడం వల్లే, అతడికి అన్ని ఓట్లు వచ్చాయని వాళ్ళు చెబుతున్నారు.నిజానిజాలు మీడియానే తేల్చాలి అన్నారు.

వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది మేమే. వరంగల్ కు రెగ్యులర్ గా వచ్చే నిధులతో పాటు, బడ్జెట్ లో అదనంగా సీఎం కెసిఆర్ గారు 250 కోట్లు ఇచ్చారు. వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లకు 300 కోట్లు ఇచ్చారు. దీన్ని బట్టి వరంగల్ అభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్త శుద్ధిని అర్థం చేసుకోవాలి. దొంగ ఓట్ల ఆరోపణలు అబద్ధం. ఓట్లు వేసే సమయంలో అన్ని పార్టీల స్థానిక ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు దొంగ ఎవరో గుర్తిస్తారు. టీఆర్‌ఎస్ పైసలు పంపిణీ చేసింది అందడం అబద్ధం. పట్టభద్రుల ఓటర్లను అవమానించవద్దని మంత్రి మండిపడ్డారు. గతంలో బీజేపీ ఎమ్మెల్సీ గా గెలిచింది. మరి అప్పుడు కూడా ఓట్లకు నోట్లు పంచారని అనుకోవాలా?.. తీన్మార్ మల్లన్నకు కూడా ఓట్లు బాగానే వచ్చాయి. అయితే ఆయన కూడా నోట్లు పంచినట్లేనా? అని మంత్రి ప్రశ్నించారు.

ఓటర్లను అవమానించడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పరిపాటే.. ప్రజలకు సీఎం కేసీఆర్, ప్రభుత్వం పట్ల స్పష్టత ఉంది. అందుకే ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్ కు అండగా నిలుస్తున్నారు. ప్రజల అండదండలే మాకు శ్రీరామ రక్ష..ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతైనా చేస్తారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -