ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తే మనమంతా క్షేమంగా ఉంటామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా పర్వతగిరి లో మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. కరోనాని సమూలంగా నాశనం చేసే సోడియం హైపో క్లోరైడ్ కొడుతూ, ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేస్తూ అనుమతిస్తూ న్న నిబంధనల మేరకు, పరిమితంగా ఊరంతా తిరిగారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, కరోనా నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ, కొందరికి స్వయంగా మాస్కులు కట్టారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ తప్ప వేరే దారిలేదన్నారు. వైరస్ నిర్మూలనకు ఇంకా వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు. ప్రపంచం అంతా గజగజ వణికి పోతుంటే, బెంబేలెత్తుతుంటే, ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రజలు, అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులంతా కలిసి కరోనా వ్యాప్తిని నిరోధించ గలుగుతున్నామ న్నారు. లాక్ డౌన్ తో నిశబ్ధ యుద్ధం చేస్తున్నామన్నారు. ఇదంతా కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లే సాధ్యమైందన్నారు. కెసిఆర్ ముందు చూపుతో ముందుగానే మేల్కొన్నామని, మరోవైపు ప్రధాని మోడీ సైతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారన్నారు. ప్రభుత్వ వినూత్న పథకాల అమలులోనే కాదు, కరోనా నిర్మూలనకు మన కెసిఆర్ తీసుకున్న చర్యలను ప్రపంచమంతా కొనియాడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు వివరించారు.