ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) కింద మంజూరు చేసే రోడ్ల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అవసరాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేకత దృష్టిలో పెట్టుకుని కొత్తగా రోడ్లను మంజూరు చేయాలని అన్నారు. పీఎంజీఎస్ వై-3 దశ కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 2,427.50 కిలో మీటర్లు మంజూరు చేసిందని… దీన్ని పెంచాలని, 4 వేల కిలో మీటర్లకు తగ్గకుండా చూడాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2007లో చేసిన తప్పిదాల కారణంగా తెలంగాణలోని 534 గ్రామాలకు తారురోడు మంజూరులో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని… దీన్ని సరి చేయాలని అన్నారు.
పీఎంజీ ఎస్ వై, ఈమార్గ్ లపై కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హరితప్లాజా హోటల్ లో శుక్రవారం ప్రాంతీయ శిక్షణ, సమీక్ష ముగింపు సమావేశం జరిగింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జనరల్ అల్కా ఉపాధ్యాయ, డైరెక్టర్లు సురభిరాయ్, సుదీప్లెగర్వాల్, బి.సి.ప్రధాన్, ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల పంచాయతీరాజ్ -గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ పాత్రను కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. ఆసరా పథకం పేరుతో సామాజిక భద్రత పథకానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలోని లేనంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ శుద్ధమైన మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం విషయంలో తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మంజూరు చేయాలని కోరారు.పీఎంజీఎస్ వై అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వ అధికారి అల్కా ఉపాధ్యాయకు లేఖ అందజేశారు. ‘
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్ డ్రఎఫ్ నిధులు ఇచ్చింది. ఈ నిధులకు సంబంధించి 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేది. వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న 9 ఉమ్మడి జిల్లాలు… అనగా ఇప్పటి 32 గ్రామీణ జిల్లాల్లో పీఎంజీఎస్ వై కింద చేపట్టే పనులకు సైతం కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర వాటా 10 శాతంగా నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరుతున్నట్లు తెలిపారు.