పారిశుద్ధ్యంలో దేశంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన ముఖ్రాకె గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని ముఖ్రా కె గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల నివేదికను చదివారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలోనే జీపీ ఒడిఎస్ ప్లస్ గ్రామంగా ముఖ్రాకె గ్రామపంచాయతి ఎంపిక అయినందుకు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తడి, పొడి చెత్త వేరు చేస్తూ సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్న ఎకైక గ్రామ పంచాయతిగా ముఖ్రాకె నిలిచింది. అంతేగాక వందకు వంద శాతం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న గ్రామంగా కూడా ఈ గ్రామం ఉంది. గ్రామ స్వరాజ్య సాధనలో ముందున్న ముఖ్రాకె గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి అభినందనలు తెలిపారు. ఈ విధంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న సర్పంచ్, ఎంపీటీసీలతోపాటు, గ్రామ ప్రజలకు ,అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్రాకె గ్రామాన్ని దేశంలోనే మిగతా గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.