ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పి.ఎంజి.ఎస్.వై – 3) మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం క్రింద నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ మూడు పథకాలకు అధిక నిధుల మంజూరు నిమిత్తం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు మూడు వేరువేరుగా విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు గురువారం విజ్ఞపన పత్రాలను సమర్పించడానికి ఢిల్లీలో కేంద్ర మంత్రి కార్యాలయంకి వెళ్లగా ఆయన అందుబాటులో లేక పోవడంతో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యక్తిగత కార్యదర్శికి మంత్రి ఎర్రబెల్లి విజ్ఞపన పత్రాలను అందించారు.
ఏడేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం కల్పించావల్సిన ఆవశ్యకత ఉందని, అందువల్ల పి.ఎం.జి.ఎస్.వై – 3 క్రింద రాష్ట్రానికి 4485 కి. మీ పోడువైన రోడ్డు సౌకర్యాన్ని నిబంధనల ప్రకారం మంజూరు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. కానీ అందులో 2427 కి. మీ మాత్రమే మంజూరు చేశారని మిగతా 2060 కి. మీ రోడ్డు సౌకర్యం మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేకూర్చాలని ఆయన కోరారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం చేపట్టి అమలు చేయబడుతున్న రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద ప్రభుత్వం 242 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించిందని ఆయన తెలిపారు. ఈ పథకం అమలుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 72 కోట్ల మొదటి విడత గ్రాంట్ ను విడుదల చేయాలని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకం కింద నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడానికి పెండింగ్ లో ఉన్న లేబర్ కాంపోనెంట్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిఎం కేసీఆర్ ముందు చూపు వల్లనే రాష్ట్రంలో వివిధ రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి అన్నారు. సిఎం కేసీఆర్ రూపొందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అనేక అవార్డులు ఇచ్చిందని ప్రశంసలు కురిపిస్తునే ఉందన్నారు. కేవలం అవార్డులు, రివార్డులు, ప్రశంసలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులను కేటాయించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.