కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ప్రజల మద్దతుతో కేంద్రాన్ని, బీజేపీని నిలదీస్తాం అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
సమాచార హక్కు చట్టం ప్రశ్నకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇప్పుడు బీజేపీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి…ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? ఇంకా ఎన్ని అబద్ధాలు అడతారు? ప‌్రజలన్ని ఎంతకాలం మోసం చేస్తారని ఆరోపించారు ఎర్రబెల్లి. బీజేపీ అంటే భారతీయ బొంకుడు పార్టీ అని తేలిపోయిందన్నారు. టీఆర్‌ఎస్ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తుంటే, బీజేపీ అబద్ధాల పునాదుల మీద అధికారం కోసం అర్రులు చాస్తుందన్నారు.
ఇప్పటి దాకా బిజెపి బండి, గుండు, తొండి మాటలతో ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు…ఇప్పుడు ఏకంగా రాష్ట్ర బిజెపి చెవుల్లో కేంద్రం పువ్వులు పెట్టిందన్నారు.తెలంగాణకి అన్యాయం చేయడం కేంద్రంలోని బిజెపికి అలవాటుగా మారింది…ఐటీఐఆర్ ప్రాజెక్టు లాగే, కాజీపేట రైల్ కోచ్ ప్రాజెక్టుకి బిజెపి మంగళం పాడింది…చాలా కాలం నుండి రైల్ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఉందన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని సిఎం కేసీఆర్ కోరారు….కేంద్రం కోరిన విధంగా 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్రం అప్పగించిందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ బద్ధమైన హక్కు….రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారని తెలిపారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక….తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమిస్తాం అన్నారు.