కొండవీడు కొండపై మొక్కలు నాటిన మంత్రి..

98
- Advertisement -

ప్రపంచ పర్యాటక కేంద్రంగా చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొండవీడును తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం పరిధిలోని కొండవీడు కోటపై అటవీ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన రూ.13.35 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కొండవీడు ప్రాంత అభివృద్ధి గురించి ముఖ్యమంత్రితో ఇప్పటికే చర్చించానని ఆయన సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేస్తున్నారన్నారు. వీలైనంత ఎక్కువ నిధులు మంజూరు చేయించి పర్యాటకంగా కొండవీడును తీర్చిదిద్దుతా మన్నారు. ఎమ్మెల్యే విడదల రజిని కొండవీడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని… కొండవీడు అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొండవీడును మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ.. కొండవీడు చరిత్ర గురించి స్థానిక, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలుసన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచంలోనే ఒక ఒక మంచి పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కొండవీడుపై అభివృద్ధి పనుల గురించి ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయించారన్నారు. ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి పూర్తిస్థాయిలో కొండవీడును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని, ఎమ్మెల్యే రజినీలు కొండవీడు కొండపై మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ , జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్ర రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -