అటవీ ప్రాంతాల అభివృద్దిలో భాగంగా ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా అటవీ అభివృద్ది సంస్థ ఆద్వర్యంలో ఎకో టూరిజం పార్కులను అభివృద్ది చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం శామీర్ పేట్ లో అరణ్య రిసార్టును మంత్రి అల్లోల ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అటవీ అభివృద్ది సంస్థ నగర, పట్టణ వాసులకు ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఎకో టూరిజం పార్క్ లను అభివృద్ది చేస్తుందన్నారు. వారాంతాల్లో కుటుంబంతో సహా సేద తీరే చక్కని ప్రాంతాలుగా, పిల్లల్లో పర్యావరణం, అటవీ, జీవ వైవిధ్యం ప్రాధాన్యతలు తెలుసుకునేలా ఇవి దోహదం చేస్తాయని తెలిపారు. తెలంగాణ అటవీ అభివృద్ది సంస్థ – ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జవహర్ లేక్ టూరిజం కాంప్లెక్స్ – ఎకో టూరిజం ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేశారన్నారు.
ఎకో టూరిజం పార్క్ లో కాటేజీలు, స్విమ్మింగ్ పూల్, చిన్న పిల్లలకు ప్రత్యేక ఆట స్థలం, సాహాస క్రీడలు, స్పా, తదితర సౌకర్యాలను నిర్వహకులు కల్పించారన్నారు. హెల్త్ టూరిజంలో భాగంగా హెల్త్ కేర్ సెంటర్ ను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారని. యోగా, నేచర్ క్యూర్, తదితర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభా, తెలంగాణ అటవీ అభివృద్ది సంస్థ (TSFDC) వీసీ ఆండ్ ఎండీ రఘువీర్, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.