మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టర్ అయ్యారు. సినిమా రంగంలో కష్టపడి పైకి రావడం, మంచి పేరు తెచ్చుకోవడాన్ని అభినందిస్తూ, గుజరాత్‌కు చెందిన ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమిషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టరేట్ అందుకున్నారు.
ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందని తమన్న తెలిపింది. తన బాధ్యతను మరింత పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని స్పష్టం చేసింది.
‘శ్రీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు ‘హ్యాపీడేస్’తో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. దాదాపు పదేళ్ల కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలిలో అవంతికగా తమన్న నటన అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం కూడా చేతినిండా అవకాశాలతో, అడపాదడపా ఐటమ్ సాంగ్స్ తో తమన్నా కెరీర్ ను కొనసాగిస్తోంది.