ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా మారారు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన `జనతా గ్యారేజ్` అందుకున్న విజయాన్ని ఇంకా తెలుగు సినిమా పరిశ్రమ మర్చిపోలేదు. అంతలోనే ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మరో సినిమా షురూ కానుండటం సినీ ప్రియులకు, అభిమానులకు పండుగే.
యువసుధ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మిక్కలినేని సుధాకర్ మాట్లాడుతూ “ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ అనుభవం తో నిర్మాత గా మారుతున్నాను. నా చిన్న నాటి స్నేహితుడు కొరటాల శివ దర్శకత్వంలో నా తొలి చిత్రాన్ని నిర్మించడం మరియు ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం ఆనందం గా ఉంది. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `జనతా గ్యారేజ్`ను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ చిత్రాన్ని మించేలా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీగా, మైలురాయిలా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. మిగిలిన అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం“ అని అన్నారు.