అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా సతీమణి మిచెల్ ఒబామాను ఓ మహిళ ఏకంగా కోతితో పోల్చి విమర్శల పాలైంది. మిచెల్ ఒబామా ‘ఏప్ ఇన్ హీల్స్’(హైహీల్స్ వేసుకున్న కోతి) అంటూ విమర్శలు చేసి తన జాత్యాంహకారాన్ని ప్రదర్శించింది. ‘ఇక త్వరలో అందమైన, హుందాగా ఉన్న, సంప్రదాయమైన ఫస్ట్‌లేడీగా మెలానియా ట్రంప్ రాబోతోంది. ఇన్నాళ్లూ హైహీల్స్ వేసుకున్న కోతిలా ఉండే మిషెల్‌ను చూసి విసిగిపోయాను’ అంటూ పమేలా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ వ్యాఖ్య పట్ల నిరసన వెల్లువెత్తింది. మితిమీరిన జాత్యహంకారానికి నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్ల్స్‌టన్‌లోని క్లే అనే చిన్న పట్టణానికి చెందిన క్లే కౌంటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పమేలా రామ్సే టేలర్.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక.. ఈ కామెంట్స్ చేసింది.
ఇది చూసిన ఆ టౌన్ మేయర్ బెవర్లీ వాలింగ్.. సరిగ్గా చెప్పావంటూ రిప్లై ఇచ్చింది. ఆ వెంటనే తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఈ కామెంట్స్ అన్నీ కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేసినా కొందరు అప్పటికే షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మిషెల్‌పై అమర్యాదకరంగా కామెంట్ చేసిన పమేలాపై చర్యలు తీసుకోవాలంటూ 14,000 మంది సంతకాలు చేసి పిటీషన్ వేశారు. దాంతో బెవర్లీ, పమేలాలు తాము చేసిన తప్పుడు వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు.
ప్రస్తుతం బెవర్లీ, పమేలాల ఫేస్‌బుక్ పేజీలను తొలగించారు. పమేలాను క్లే కౌంటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో లెస్లీ మెక్‌గ్లొతిన్ అనే మరో యువతికి బాధ్యతలు అప్పగించారు.
గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబాన్ని కోతులు, గొరిల్లాలతో పోల్చిన వాషింగ్టన్ మేయర్ పాట్రిక్ రుషింగ్ పెను వివాదాన్ని రేపాడు. తొలి మహిళ మిచెల్ ఒబామాది గొరిల్లా ఫేస్ అని తన ఫేస్‌బుక్ ఖాతా లో పోస్టు చేసి పెను దుమారాన్ని రేపాడు.మిచెల్ ది గొరిల్లా ముఖం. కాదని అనలేరు. ఈ మహిళ మంకీ మ్యాన్ ఒబామాకు తప్ప మరెవరికీ ఆకర్షణీయం కాదు. కావాలంటే వారి చెవులు చూడండి అని పాట్రిక్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.